
తాజా వార్తలు
తలపైకెత్తి చూసి ఉంటే.. మిగిలేది ప్రాణం!
1670 కిలోమీటర్ల ప్రయాణం.. 40 కి.మీ. దూరంలో గమ్యం
ఇంతలో విద్యుదాఘాతంతో కంటైనర్ డ్రైవర్ మృతి
దిలీప్‌కుమార్
న్యూస్‌టుడే, మనోహరాబాద్: ప్రమాదాలు ఏ రూపంలో, ఎక్కడ పొంచి ఉంటాయో ఒక్కోసారి అంతుచిక్కని ప్రశ్న. 1670 కి.మీ. దూరాన్ని సురక్షితంగా చేరుకున్న వ్యక్తి.. మరో 40 కి.మీ. గమ్యస్థానం చేరుకునే లోపు విద్యుదాఘాతంతో మృత్యువాత పడిన ఘటన 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. సాధారణంగా వాహన చోదకుడు ముందు, వెనుక, ఇరువైపులా చూసుకుంటూ నడిపితే ప్రమాదాలు జరగవని చెబుతుంటారు రవాణా, పోలీసు అధికారులు. వాహనాన్ని నిలిపేటపుడూ నలువైపులా, పైన కూడా పరిశీలించుకోవాలనేది ఈ ఘటన చెబుతోంది. కంటైనర్ డ్రైవర్ పంక్చర్ అయిన టైరు మార్చేందుకు వాహనాన్ని విద్యుత్తు తీగల కింద నిలిపి.. చూసుకోకుండా జాకీతో లేపడంతో విద్యుదాఘాతమై అక్కడికక్కడే చనిపోయాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్ఐ రాజు గౌడ్ తెలిపిన వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఇటావా జిల్లా మొయిన్‌పురా తాలుకా సైఫాయ్ గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ శర్మ (26) దేశ రాజధాని దిల్లీనుంచి ద్విచక్ర వాహనాలను కంటైనర్‌లో హైదరాబాద్‌కు తీసుకుని వస్తున్నాడు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిలో రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళ్లకల్ వద్దకు రాగానే ఓ టైరు పంక్చర్ అయింది. టైరు మార్చేందుకు కంటైనర్‌ను రోడ్డుపక్కన ఉన్న మీరాదేవి దాబా వద్ద నిలిపాడు. నిలిపే ముందు పైన 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలను గమనించలేదు. జాకీ అమర్చి వాహనాన్ని కొద్దిగా పైకి లేపగా కంటైనర్‌కు విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుదాఘాతంతో కంటైనర్ కింద ఆనుకొని ఉన్న దిలీప్ తల భాగం పూర్తిగా కాలిపోగా అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన దాబాలోని ప్రజలు బయటకు వచ్చి కాళ్లకల్ విద్యుత్తు ఉపకేంద్రానికి సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపి వేయించి అతడిని బయటకు తీశారు. సమీపంలోని పంక్చర్ దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యుత్తు తీగల కింద నిలిపిన కంటైనర్