
తాజా వార్తలు
యువతి గొంతుకోసి..తానూ కోసుకొని..
ప్రేమ నిరాకరించిందని యువకుడి ఘాతుకం
విశాఖలో కలకలం
విశాఖపట్నం (జగదాంబకూడలి, ఎంవీపీ కాలనీ), న్యూస్‌టుడే: ఇంటి సమీపంలో నివసిస్తున్న యువతిపై కన్నేసి ప్రేమిస్తున్నానంటూ అతడు వెంటపడ్డాడు. నిరాకరించడంతో ఆ ప్రేమోన్మాది కత్తితో ఆమె గొంతు కోశాడు. తానూ గొంతు కోసుకున్నాడు. రక్త గాయాలై ఇద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం బుధవారం విశాఖలో చోటు చేసుకుంది. గాజువాకలో నెల కిందట యువతిని కత్తితో పొడిచి ఓ ప్రేమోన్మాది హత్య చేసిన సంఘటన మరవకముందే ఈ దారుణం వెలుగుచూసింది. పాత నగరంలో నివసిస్తున్న యువతి (20) ఇంటర్ వరకు చదువుకుంది. ఆమె ఇంటి సమీపంలో 20 ఏళ్లుగా యువకుడు అద్దెపల్లి శ్రీకాంత్ (23) కుటుంబం నివసిస్తోంది. రెండు కుటుంబాలు సఖ్యంగా ఉండేవి. యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆరు నెలలుగా శ్రీకాంత్ వేధిస్తున్నాడు. ప్రేమ గురించి తన కుటుంబీకులకూ చెప్పారు. వారు యువతి తల్లిదండ్రులతో మాట్లాడారు. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తుండటంతో శ్రీకాంత్ కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉదయం యువతి తల్లిదండ్రులు నీళ్లు పట్టుకోవడానికి బయటకు వెళ్లారు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నది గమనించి.. ఇదే అదనుగా లోనికి చొరబడి గడియ పెట్టేశాడు. కత్తితో యువతి గొంతు కోశాడు. తానూ గొంతు కోసుకున్నాడు. యువతి విలవిల్లాడుతూ గడియ తీసుకుని బయటకు వచ్చేసింది. శ్రీకాంత్ కూడా బయటకొచ్చి సమీపంలో ఉన్న యువతి చిన్నమ్మ ఇంటికెళ్లి విషయం చెప్పాడు. ఆమె అప్రమత్తమై రక్తస్రావంతో బాధపడుతున్న యువతిని స్థానికుల సహకారంతో కేజీహెచ్‌కు తరలించారు. యువకుడు శ్రీకాంత్‌ను కూడా కుటుంబీకులు కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఇద్దరి కుటుంబీకులు చేరడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శస్త్రచికిత్సల అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దిశా పోలీసుస్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ తెలిపారు. వారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం కుదుటపడ్డాక వివరాలు సేకరిస్తామని అన్నారు. శ్రీకాంత్‌పై కేసు నమోదు చేశామన్నారు. గతంలో శ్రీకాంత్‌పై యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తించామన్నారు. ప్రేమించాలంటూ శ్రీకాంత్ తమ కూతురిని ప్రతిరోజూ ఫోన్లో వేధించేవాడని యువతి తల్లిదండ్రులు తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తన మార్చుకోలేదని అన్నారు. ప్రభుత్వం తక్షణం కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. వరుస ఘటనలపై నగర మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నారు.