
తాజా వార్తలు
భార్య, కుమారులే నిందితులు
వీడిన హత్య కేసు మిస్టరీ
జహీరాబాద్, న్యూస్‌టుడే: ఈ నెల 8న న్యాల్కల్ మండలం బసంత్‌పూర్ శివారులోని చెక్‌డ్యాంలో లభించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, గ్రామీణ సీఐ కృష్ణకిషోర్, హద్నూర్ ఎస్సై విజయరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లు, చేతులు, మొండెం వేరుచేసి ఓ సంచిలో మూటగట్టి చెక్‌డ్యాంలో పారేసిన మృతదేహం కర్ణాటకలోని అష్టూర్ గ్రామానికి (మన రాష్ట్ర సరిహద్దు గ్రామం) చెందిన వైద్యనాథ్ (57)గా గుర్తించినట్లు తెలిపారు. భార్య పుణ్యమ్మకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ.. తరచూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో పాటు గ్రామంలో ఈ విషయం ప్రచారం చేయడంతో కుటుంబం పరువు పోతుందని విసుగు చెందిన భార్య, కుమారులతో కలిసి హత్య చేసింది. డిసెంబరు 31న వైద్యనాథ్‌ను ఇంటిలో బంధించి.. తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం తల, కాళ్లు, చేతులు వేరు చేసి ఓ సంచిలో కుక్కి రాష్ట్ర సరిహద్దు దాటి వచ్చారు. బసంత్‌పూర్ శివారులోని చెక్‌డ్యాంలో పారేసినట్లు పేర్కొన్నారు. ఐదుగురు కలిసి ఈ హత్యకు పాల్పడగా బుధవారం సంతోష్, అనుకేష్లను అరెస్టు చేయగా భార్య పుణ్యమ్మతో పాటు కుమారులు అంకుష్, ఆకాశ్ పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.