
తాజా వార్తలు
విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి
ప్రాణం తీసిన కోడికూర
చింతలమానెపల్లి, న్యూస్‌టుడే: పత్తి చేనుకు వెళ్లి అలసిపోయి వచ్చిన కుటుంబసభ్యులను కష్టపెట్టడం ఇష్టంలేక స్వయంగా కోడికూర వండుదామని అనుకున్నారు ఆ తండ్రీకొడుకులు. కూర వండే సమయంలో విద్యుదాఘాతంతో ఇద్దరూ మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్లో చోటు చేసుకుంది. శంకర్(50) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు. ఆయనకు భార్య పద్మతో పాటు, ఇద్దరు కుమారులు విజయ్ (మూగ), దిలీప్, కుమార్తె ఉన్నారు. దిలీప్ రెబ్బెనలో ఉంటారు. విజయ్‌కు రెండేళ్ల కిందటే వివాహమైంది. కుమార్తెకు కూడా వివాహం కాగా వీరి నివాసం సమీపంలోనే ఉంటుంది. ఆదివారం కోడికూర వండుకుందామని శంకర్, విజయ్ అనుకున్నారు. తన భార్య, కోడలు పత్తి చేను నుంచి వచ్చి ఆలసిపోతారని, వారిని శ్రమ పెట్టడం ఎందుకని శంకర్.. మూగవాడైన కొడుకు విజయ్‌తో కలిసి కోడికూర వండుదామని నిర్ణయించుకున్నారు. రేకుల ఇల్లు కావడంతో విజయ్ నూనె డబ్బాను తీసే క్రమంలో రేకులకు విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. మూగవాడైన కొడుకు తండ్రికి ఏమి చెప్పలేకపోయాడు. కిందపడిపోయి ఉన్న విజయ్‌ని శంకర్ పట్టుకోవడంతో ఆయన కూడా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.