
తాజా వార్తలు
నాన్నా... నన్నెందుకు చంపావ్?
● తండ్రి చేతిలో పసిపాప హతం
● మద్యం మత్తులో ఘాతుకం
పాపతో తల్లి లక్ష్మి
న్యూస్‌టుడే, నందికొట్కూరు, జూపాడుబంగ్లా: మద్యం మత్తు ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రి చేతిలోనే హతమైన ఆ పసిప్రాణం నేనేం తప్పు చేశానంటూ దీనంగా ప్రశ్నిస్తోంది. ఈ అమానవీయ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లా ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన బాలిరెడ్డి, కర్నూలు జిల్లా ఆదోని మండలం మార్కాపురం గ్రామానికి చెందిన లక్ష్మికి రెండేళ్ల కిందట వివాహమైంది. బాల్‌రెడ్డి రహదారి వెంట ప్లాస్టిక్ కాగితాలు, టైర్లు ఏరుకుని విక్రయించేవాడు. లక్ష్మి చుట్టుపక్కల యాచక వృత్తి చేసేది. వారు సంచారం చేసుకుంటూ నాలుగు నెలల కిందట జూపాడుబంగ్లా మండలం 80 బన్నూరు గ్రామానికి వచ్చారు. అక్కడ గతేడాది డిసెంబరులో లక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి వారు జూపాడుబంగ్లాకి చేరుకుని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని పాడుబడిన కేసీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సోమవారం రాత్రి అధికంగా మద్యం తాగిన బాల్‌రెడ్డి భార్యతో గొడవ పడ్డాడు. ఆమె చేతిలో ఉన్న రెండు నెలల పాప దుర్గను తన చేతుల్లోకి తీసుకుని కిందకు వదిలేశాడు. లక్ష్మి భర్తతో గొడవ పడి పాపను తీసుకుని పడుకుంది. ఉదయం లేచి చూడగా పసికందు మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని బయటికి రాకుండా పాపను ఖననం చేసేందుకు బాల్‌రెడ్డి ప్రయత్నించాడు. స్థానికులకు తెలియడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాప తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందికొట్కూరు గ్రామీణ సీఐ ప్రసాద్ తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నందికొట్కూరు ఆసుపత్రికి తరలించినట్లు సీఐ చెప్పారు.
పోలీసుల అదుపులో తండ్రి బాల్‌రెడ్డి