
తాజా వార్తలు
టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
స్నేహితుల దాడే కారణమా!
నెల్లూరు (నేర విభాగం) : సామాజిక మాధ్యమాల్లో సుపరిచితుడైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నగరంలో చర్చనీయాంశమైంది. ఆత్మహత్య వెనక తోటి స్నేహితుల దాడితో పాటు ప్రేమ వ్యవహారం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రంగనాయకులపేటకు చెందిన రియాజ్, షాహీనా దంపతుల మూడో కుమారుడు షేక్ రఫి (23). ప్రైవేటు కార్యక్రమాలకు వీడియోలు తీస్తుంటారు. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారారు. ఇతడి స్నేహితుడు నారాయణరెడ్డిపేటకు చెందిన ముస్తఫా. చిన్నపిల్లల పార్కు రోడ్డు ప్రాంతంలో గేమ్స్ జోన్లో పనిచేస్తున్నాడు. ముస్తఫా ఓ యువతిని ప్రేమిస్తుండగా- ఆ విషయం రఫీకి కూడా తెలుసు. కానీ, రెండు నెలలుగా ఆ యువతి, రఫీ చనువుగా ఉంటున్నారు. ఈ క్రమంలో స్నేహితులిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నెల 20న రఫి ఆ యువతితో కలిసి మనుబోలులోని ఓ ప్రాంతానికి వెళ్లారు. అది తెలిసి ముస్తఫా ఆ యువతికి ఫోను చేసి ఆరా తీశారు. రఫితో టీ తాగేందుకు వచ్చానని ఆమె చెప్పగా.. అతడి తీసుకుని నాలుగో మైలు వద్దకు వస్తే ఈవెంట్‌కు సంబంధించిన నగదు ఇస్తానని చెప్పారు. దాంతో వారిద్దరు అక్కడికి చేరుకోగా... ముస్తఫా, మరికొందరు స్నేహితులు రఫిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో ఇంటికెళ్లిన రఫీని తండ్రి రియాజ్ బాషా ఆసుపత్రికి తీసుకెళ్లారు. తనపై ముస్తఫా దాడి చేశాడని తండ్రికి రఫి తెలిపారు. దీనిపై 21వతేదీన నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెదిరింపులతోనే..? : ముస్తఫా బెదిరింపులతోనే తన కుమారుడు ఉరి వేసుకున్నాడని రఫీ తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోకుంటే నీ అంతు చూస్తానని బెదిరించడంతోనే భయపడి ఈ నెల 22న రాత్రి రఫీ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సంతపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.