
తాజా వార్తలు
కాలిన గాయాలతో.. రోడ్డు పక్కన నగ్నంగా
యూపీలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన విద్యార్థిని
షాజహాన్‌పుర్: కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఒంటి నిండా కాలిన గాయాలతో, నగ్నంగా జాతీయ రహదారి పక్కన అచేతనావస్థలో కనిపించిన దిగ్భ్రాంతికర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో జరిగింది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్ ఆధ్వర్యంలోని ముముక్షు ఆశ్రమం నిర్వహిస్తున్న స్వామి సుఖ్‌దేవానంద్ కళాశాలలో ఆమె బీఏ రెండో ఏడాది చదువుతోంది. సోమవారం తన తండ్రితో కలసి ఆమె కళాశాలకు వచ్చింది. తరగతులు ముగిసినా ఆమె బయటకు రాకపోవడంతో తండ్రి తన కోసం వెతకడం మొదలెట్టారు. కాసేపటి తర్వాత ఆమె లఖ్‌నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన పడిపోయి ఉందని సమాచారం అందింది. పోలీసులు ఆమెను లఖ్‌నవూలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు 60 శాతం కాలిన గాయాలయ్యాయని, ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదని, ఆమె కోలుకున్నాకే ఏం జరిగిందన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
* షాజహాన్‌పుర్ జిల్లాలోనే మరో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. స్నానం చేయడానికి ఊరి బయట ఉన్న చెరువు దగ్గరకు వెళ్లిన ఐదేళ్ల బాలిక, తనకు సోదరి వరుసయ్యే ఏడేళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యం అయ్యారు. వారి కోసం గ్రామస్థులు వెతకగా ఐదేళ్ల బాలిక సమీప పొలంలో విగతజీవిగా కనిపించింది. మరో బాలిక పొరుగూరిలో గాయాలతో పడిపోయి ఉన్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు విద్యార్థినులు అదృశ్యం
ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ జిల్లాలో సోమ, మంగళవారాల్లో నలుగురు కళాశాలల విద్యార్థినులు అదృశ్యమయ్యారు. కళాశాలకు వెళ్లిన వారు తిరిగిరాకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనవారిలో ఇద్దరు హిదయత్‌నగర్ ప్రాంతానికి చెందిన వారు కాగా మరో ఇద్దరు రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. బాలికల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.