70 కి.మీ.లు.. 70 నిఘా నేత్రాలు

తాజా వార్తలు

Updated : 09/04/2021 10:39 IST

70 కి.మీ.లు.. 70 నిఘా నేత్రాలు

నడిరోడ్డుపై పట్టపగలే రెండేళ్ల బాలుడి అపహరణ ●

30 గంటల్లో రక్షించిన రాచకొండ పోలీసులు


చిన్నారిని తల్లికి అప్పగిస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, నాగోలు: 70 కి.మీలు.. 70 సీసీ కెమెరాలు.. 25 మంది సిబ్బంది.. 30 గంటల నిరంతరాయ శ్రమ. కిడ్నాపైన బాలుణ్ని రక్షించేందుకు రాచకొండ పోలీసులు పడిన శ్రమ ఇది. పిల్లలుంటేనే రెండో భార్య పుట్టింటి నుంచి మెట్టినింటికి వస్తుందని భావించి ఓ వ్యక్తి ఈ కిడ్నాప్‌ చేసినట్లు తేల్చారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అంతంపేటలో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ గురువారం వెల్లడించారు.

ముత్తయ్య

ఎవరు..? ఎటువైపు వెళ్లాడు..?

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణ్‌పేట్‌ సమీపంలోని కొత్తగంజి కుమ్మరివాడకు చెందిన శ్రీను, మంజు దంపతులకు మూడేళ్ల పాప, రెండేళ్ల బాబు ఉన్నాడు. నగరానికి వలసొచ్చి మాదన్నపేట మార్కెట్‌ వద్ద ఉంటున్నారు. ఈనెల 6న శ్రీను పనికెళ్లాడు. మంజు కుమారుడితో కలిసి కొత్తపేట చౌరస్తాలో భిక్షాటన చేస్తోంది. మధ్యాహ్నం చిన్నారిని ఫుట్‌పాత్‌పై కూర్చొబెట్టి పక్కకు వెళ్లింది. తర్వాత తిరిగొచ్చి చూస్తే బాబు కనిపించలేదు. చుట్టుపక్కలా వెతికినా ఫలితం లేకపోవడంతో సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరూర్‌నగర్‌ సీఐ సీతారాం అప్రమత్తమయ్యారు. అయిదు బృందాలను రంగంలోకి దించారు. సీసీ కెమెరా ఫుటేజీలో బాబును ఓ వ్యక్తి ఎత్తుకుని రోడ్డు దాటినట్లు గుర్తించారు.

ఎల్బీనగర్‌, చౌటుప్పల్‌, సర్వేల్‌..

విజయవాడవైపు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో రాత్రి 1.30 గంటల సమయంలో ఎల్బీనగర్‌ ఠాణాకు చేరుకున్నారు. మరో 20 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. విజయవాడ వెళ్లే బస్సులు ఆగే చోట ఆ వ్యక్తి బాబును ఎత్తుకుని ఓ ఆటోలోకి ఎక్కినట్లు కనిపించింది. ఆ ఆటో నంబర్‌ను గుర్తించారు. చౌటుప్పల్‌లో దింపినట్లు ఆ ఆటోడ్రైవర్‌ ఫోన్‌లో సమాచారమిచ్చాడు. ఇన్‌స్పెక్టర్‌ సీతారాం నేతృత్వంలో బృందాలు చౌటుప్పల్‌కు చేరుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తంగెడుపల్లి చౌరస్తాకు వెళ్లారు. అక్కడ మరో 10 సీసీ కెమెరాలను పరిశీలించగా ఆటోలో గుడిమల్కాపూర్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను ఆరాతీస్తే సర్వేల్‌లో దింపినట్లు చెప్పాడు.

రెండో భార్యను మెట్టినింటికి రప్పించేందుకే...

సర్వేల్‌లో ఫొటోలు చూపించగా ఓ మహిళ సోదరుడని చెప్పారు. ఆ మహిళను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. 6వ తేదీ రాత్రి సోదరుడు మానుపాటి ముత్తయ్య(45) బాబును తీసుకొచ్చాడని చెప్పింది. కోప్పడడంతో పక్కనే ఉన్న సొంతూరుకి వెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. అక్కడ నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ముత్తయ్యకు 20 ఏళ్ల కింద వివాహమయ్యింది. ఇద్దరు కుమార్తెలు. పెద్దామె చనిపోయింది. చిన్నకుమార్తెతో కలిసి తొలి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండేళ్ల కిందట మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టలేదని ఆమే పుట్టింటికి వెళ్లిపోయింది. బాబు ఉన్నాడని తెలిస్తే వస్తుందని భావించే ఈ కిడ్నాప్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. సీఐ సీతారాం, సిబ్బందిని సీపీ అభినందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని