close

తాజా వార్తలు

Updated : 04/05/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంధాలను తెంపేసి.. అనుబంధాలను చెరిపేసి

వ్యాన్‌ ఢీకొని తోడల్లుళ్ల దుర్మరణం

సీతానగరం, పోలవరం, న్యూస్‌టుడే: వాళ్లిద్దరూ ఒక కడుపున పుట్టలేదు గానీ, కష్టసుఖాలు, కలిమిలేమిలో కలిసే ఉండేవారు. అక్కచెల్లెళ్లను వివాహమాడి తోడల్లుళ్లుగా బంధమేసుకుని బంధువులయ్యారు. అన్నదమ్ములకు మించి అనుబంధమేర్పడింది. అందుకేనేమో విధి పగబట్టినట్లు వారి చివరి శ్వాసను సైతం జంటగానే తీసుకుపోయింది. అక్కాచెల్లెళ్లు తోడును కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నారు. తెల్లవారితే ఇంటికొస్తారని గుమ్మం ముందు కూర్చుని పిల్లలతో ఎదురుచూసిన వారు మూటకట్టి వచ్చిన మృతదేహాలను చూసి మూగబోయారు.

వ్యవసాయ పనులకు వెళ్లి..

సీతానగరం మండలంలోని సింగవరానికి చెందిన తోడల్లుళ్లు కొండిపూడి నాగరాజు (40), దారా కాంతారావు(37) వ్యవసాయ పనుల కోసం గత నెల 30న పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం వెళ్లారు. పోలవరం మండలం పట్టిసీమ పంచాయతీ పరిధిలోని వెంకటాపురం సమీపంలో సోమవారం తెల్లవారుజామున పనులకు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని వ్యాన్‌ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు ఎస్సై చెప్పారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్వగ్రామంలో పనులు తక్కువగా ఉండడం, వచ్చే వేతనాలు చాలక మరో అయిదుగురుతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 

సింగవరంలో రోదిస్తున్న బంధువులు

అన్నదమ్ములకు మించిన బంధం

చీపురుపల్లికి చెందిన పోశమ్మ(36), కమలరత్నం(34) అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకుని నాగరాజు, కాంతారావు తోడుళ్లులయ్యారు. భార్యలతో కలిసి పనులకు వెళ్తూనే పిల్లలను చదివిస్తున్నారు. పోలవరం వద్ద వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో మరో అయిదుగురు కలిసి వీరు పనులు చేసేందుకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుప్పనూర్పిడి యంత్రాల వద్ద పనిచేస్తే రూ.800కు పైగానే వస్తోంది. నాలుగైదు రోజుల పాటు పనులు చేసి ఇంటికి రావడం వీరికి అలవాటు. మంగళవారం ఇంటికొచ్చి మళ్లీ వెళ్తామని ఫోన్‌ చేసి చెప్పిన వారిద్దరూ నిర్జీవంగా రావడంపై భార్యలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాగరాజు, కాంతారావు చదువుకోలేదు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులతోనే కలిసి పనులకు వెళ్లేవారు. తోడల్లుళ్లులైన వీరిద్దరూ కూలి పనులకు కలిసే వెళ్లేవారు.

తల్లడిల్లిన కుమార్తెలు..

నాగరాజుకు పదేళ్ల కుమార్తె దివ్య, కాంతారావుకు తొమ్మిదేళ్ల కూతరు శశి ఉన్నారు. పిల్లలు జీవితాలు తమలా మారకూడదని కష్టపడి చదివిస్తున్నారు. ముందురోజు ఇద్దరు పిల్లలు వారి నాన్నలతో ఫోన్‌లో మాట్లాడారు. చెయ్యిపట్టుకు నడిపించే నాన్న ఇక లేరనే విషయం తెలిసి తల్లడిల్లుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని