కిక్కు కోసం.. ఒంటరి మహిళలే లక్ష్యం

తాజా వార్తలు

Updated : 14/05/2021 06:42 IST

కిక్కు కోసం.. ఒంటరి మహిళలే లక్ష్యం

19 మందిపై అత్యాచారం.. దోపిడీ


హుస్సేన్‌ఖాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: డబ్బు, ఆభరణాల కోసం, పగ, ప్రతీకారం కోసం నేరాలు చేస్తుంటారు.. కానీ ఈ దొంగ ఎందుకు చేస్తుంటాడో తెలిస్తే ఔరా.. అనక మానరు. మూడు, నాలుగు నెలలకొకసారి ‘కిక్కు’ కోసం చేస్తుంటాడు. కల్లు కాంపౌండ్ల దగ్గర కనిపించే ఒంటరి మహిళలను బండిపై ఎక్కించుకుని శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుని ఆపై నగలతో ఉడాయిస్తాడు. వారికి ఎలాంటి హానీ చేయడు. అలాచేయడం వల్ల తనకు ఎక్కడా లేని మజా వస్తుందని.. ఇప్పటివరకు 19 మంది మహిళలను ఈ తరహాలో వంచించినట్లు ఘట్‌కేసర్‌ నారపల్లికి చెందిన హుస్సేన్‌ఖాన్‌(46) చెప్పడంతో రాచకొండ పోలీసులు కంగుతిన్నారు. ఎల్బీనగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ పార్థసారథి ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు ఎన్నో వెలుగు చూశాయి. గురువారం అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల మ్యాన్‌ప్యాక్‌ దొంగిలించి..

2006లో తొలిసారిగా మరో వ్యక్తితో కలిసి సైఫాబాద్‌ ఠాణా పరిధిలో పోలీసుల మ్యాన్‌ప్యాక్‌(పోలీసుల చేతిలో ఉండేది)ను చోరీ చేశాడు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ ప్రేమికులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. సైఫాబాద్‌ పోలీసులు అదుపులోకి జైలుకు తరలించారు. అక్కడ కొందరు నేరస్థులు పరిచయమయ్యారు. కల్లు దుకాణాల వద్ద ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుంటే ఎవరూ పట్టించుకోరని వాళ్లు చెప్పారు. దీంతో అటువైపు దృష్టి పెట్టాడు.

ఇద్దరే ఫిర్యాదు చేశారు..

నాగోలు, న్యూస్‌టుడే: హుస్సేన్‌ఖాన్‌ అరెస్టుపై గురువారం ఎల్బీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. నిందితుడిపై గతంలో పీడీ చట్టాన్ని ప్రయోగించి ఏడాదిపాటు చర్లపల్లి జైలుకు పంపారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల ఒకటో తేదీన జిల్లెలగూడలోని కల్లు కాంపౌండ్‌కు వెళ్లిన హుస్సేన్‌ఖాన్‌.. అక్కడో మహిళకు మాయయాటలు చెప్పి పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ సమీపానికి తీసుకెళ్లాడు. మహిళ నుంచి చెవిదుద్దులు, మాటీలు, నల్లపూసల తాడు, పర్సులోని రూ.2,500 తీసుకున్నాడు. తన లైంగిక వాంఛ తీర్చుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన హయత్‌నగర్‌ పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా గురువారం పెద్ద అంబర్‌పేటవద్ద హుస్సేన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీర్‌పేట, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ఛత్రీనాక, కంచన్‌బాగ్‌ తదితర ఠాణాల పరిధిలో ఈ తరహా మొత్తం 19 నేరాలనూ తానే చేసినట్లు అంగీకరించాడు. 9 తులాల బంగారం, రూ.45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా 19 మంది మహిళల్లో ఇద్దరే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. ‘నేను కేవలం కిక్కు కోసమే చేశా. మూడు, నాలుగు నెలలకోసారి అలా చేయకపోతే నాకు మజా రాదు. నిద్ర పట్టదు’ అని నిందితుడు వెల్లడించడంతో అధికారులు అవాక్కయ్యారు.

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడంటే ఆరోజు...

తన కుమారుడి పేరు మీద రిజిస్టర్‌ అయిన ద్విచక్రవాహనంపై హుస్సేన్‌ఖాన్‌ బయలుదేరుతాడు. ఇంటి నుంచి బయటకు రాగానే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తాడు. అంటే ఆరోజు ఏదో నేరం చేయబోతున్నాడని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. మళ్లీ ఇంటికొచ్చిన తర్వాతే ఫోన్‌ ఆన్‌ చేస్తాడు. సాయంత్రం మాత్రమే మహిళలను బండిపై ఎక్కించుకుంటాడు. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్లకు సమీపంలోని పొదల చాటుకు తీసుకెళ్తాడు. ఆభరణాలు తీసి డిక్కీలో వేయమంటూ పురామయిస్తాడు. కోరికలు తీర్చుకున్న తర్వాత అక్కడి నుంచి ఉడాయిస్తాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని