ప్రేమలో ఓడిపోయారు.. చావులో ఒక్కటయ్యారు!
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 06:13 IST

ప్రేమలో ఓడిపోయారు.. చావులో ఒక్కటయ్యారు!

ఈనాడు, హైదరాబాద్‌/న్యూస్‌టుడే, జగద్గిరిగుట్ట: ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే.. చిన్నప్పటి నుంచి పరిచయముంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ అమ్మాయి మైనర్‌ కావడంతోపాటు, పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు.  అబ్బాయికి అతని కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. పెళ్లి జరిగితే ఆ ఎడబాటును భరించలేమనుకున్నారు. చావులోనైనా ఒక్కటవుదామనుకొన్నారు. ఆఖరికి అదే చేసి రెండు కుటుంబాల్లో విషాదం నింపారు. ఈ హృదయవిదారక ఘటన జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ పి.సైదులు కథనం ప్రకారం.. కూకట్‌పల్లి సమీపంలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్‌నగర్‌లో ఉండే దంపతులకు నలుగురు కుమార్తెలు. వృత్తి టైలరింగ్‌. వీరి రెండో కుమార్తె(16).. అదే బస్తీలో ఉండే విశాల్‌(21) ప్రేమించుకున్నారు. ఆ యువకుడు ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరూ తమ ప్రేమ గురించి నెల కిందట ఇంట్లో చెప్పారు. వారు అంగీకరించలేదు. విశాల్‌ స్వయంగా అమ్మాయి వాళ్ల ఇంటికెళ్లి మాట్లాడినా ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా విశాల్‌కు అతని కుటుంబ సభ్యులు జనగామలో సంబంధం చూశారు. కుటుంబమంతా కలిసి అక్కడికి వెళ్లి అమ్మాయిని చూసి వచ్చారు. మాటామంతీ పూర్తయ్యింది. కరోనా పరిస్థితులు చక్కబడగానే పెళ్లి తంతు జరిపించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి విశాల్‌, ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడకుండా దిగాలుగా ఉంటున్నారు. ఈ నెల 14న తెల్లవారుజామున 4 గంటలకు ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాల్‌పైనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ మేరకు సీఐ సైదులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గాజులరామారం డివిజన్‌ బాలయ్యనగర్‌ సమీపంలోని క్వారీ నీటిగుంతలో ఆదివారం రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు అక్కడికి చేరుకొని ఈ మృతదేహాలు విశాల్‌, ఆ బాలికదేనని తేల్చారు. శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని