Prision: 25ఏళ్లు.. 28సార్లు జైలు
close

తాజా వార్తలు

Updated : 19/05/2021 08:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prision: 25ఏళ్లు.. 28సార్లు జైలు

నెల్లూరు (నేర విభాగం): 25కి 28... ఇవి మార్కులో.. సాధించిన రికార్డులో కావు. అలా అనుకుంటే మనం పొరబడినట్లే. ఎందుకంటే.. 25 ఏళ్ల ఓ యువకుడు.. 28 సార్లు పలు నేరాల్లో అరెస్టయిన వైనమిది. వ్యసనాలకు బానిసైన అతడి నేర చరిత ఇది. గత కొంత కాలంగా అతడిపై నిఘా ఉంచిన పోలీసులు.. ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి రాపూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 11.44 లక్షల సొత్తు రికవరీ చేశారు. ఆయా వివరాలను మంగళవారం సాయంత్రం స్థానిక ఉమేష్‌ చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ వెల్లడించారు.
జువైనల్‌ హోమ్‌ నుంచి...
కలువాయి మండలం వెరుబొట్లపల్లికి చెందిన గోగుల శివయ్య 16 ఏళ్ల వయస్సులోనే వ్యసనాలకు బానిసయ్యాడు. విలాస జీవితం గడిపాలని మోజు పడ్డాడు. ఆ వయస్సులోనే నెల్లూరు నగరంలోని ఓ దుకాణంలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. వారు అతడిని తిరుపతిలోని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. అక్కడి నుంచి బయటకు వచ్చినా.. తీరు మార్చుకోని శివయ్య- రాత్రిళ్లు వాహనంలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఆ క్రమంలో జిల్లా వ్యాప్తంగా నేరాలకు పాల్పడ్డాడు. జిల్లా పోలీసులు ఇప్పటికే 28 నేరాల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. కలువాయి పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై వెంకటగిరి ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.నాగమల్లేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసి.. శివయ్య కోసం ముమ్మరంగా గాలించారు. ఈ నెల 17వతేదీ అర్ధరాత్రి.. రాపూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని మద్దెలమడుగు జంక్షన్‌ వద్ద అరెస్టు చేశారు. అతడి నుంచి రాపూరు, డక్కిలి, చేజర్ల, మనుబోలు, సంగం పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన ఎనిమిది కేసులకు సంబంధించి రూ. 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 40వేల నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘరానా దొంగను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, రాపూరు ఎస్సై ఎన్‌.క్రాంతికుమార్‌, బాలాయపల్లి హెడ్‌కానిస్టేబుల్‌ బి.మధుసూదన్‌రావు, డక్కిలి పీఎస్‌ పీసీ ఎం.పవన్‌కుమార్‌, టి.లక్ష్మీకాంత్‌, వి.మురళి, హోంగార్డు ఎస్‌డీ ఆబిద్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటరత్నం పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని