సరకు మాటున.. గుట్కా రవాణా
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 04:24 IST

సరకు మాటున.. గుట్కా రవాణా

ముగ్గురి అరెస్ట్‌, రూ.1.02 కోట్ల విలువైన పొట్లాలు పట్టివేత
లారీలోని గుట్కాలను చూపుతున్న సీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ నుంచి సరకు రవాణా లారీల్లో హైదరాబాద్‌కు గుట్టుగా వస్తున్న గుట్కా రాకెట్‌ను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. వీటిని తెప్పిస్తున్న నవభారత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని ప్రతాప్‌కుమార్‌ భాస్కర్‌, ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అమొఇత్‌ అనిల్‌యాదవ్‌, మోహన్‌ రాఘోబాలను అరెస్ట్‌ చేశారు. రూ.71.93 లక్షల విలువైన గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ సీపీ వి.అంజనీకుమార్‌ శనివారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఔటర్‌ దిల్లీ నుంచి సరకు కొన్నినెలలుగా ఇక్కడకు వస్తోందని, ఇక్కడి నుంచి నగరంలోని డీలర్లకు, కృష్ణా, కడప, కర్నూలు, తూగో జిల్లాలకు పంపుతున్నారని వివరించారు. గుట్కాను లారీల్లోని లోపలి అరల్లో వేయించి.. దుస్తులు, కుట్టుమిషన్లు, ఇతర సామగ్రి, యాపిల్‌ పండ్ల కార్టన్లను వేసే వారని.. అలా సరిహద్దులు దాటి వచ్చిన సరకును బేగంబజార్‌లోని నవభారత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో అన్‌లోడ్‌ చేసేవారని తెలిపారు.

వ్యాపారుల్లా నటించి..

లాక్‌డౌన్‌ సమయంలోనూ గుట్కా రవాణా ఎక్కడి నుంచి వస్తుందన్న అంశంపై ఉత్తరమండలం సీఐ కె.నాగేశ్వరరావు వివరాలు సేకరించారు. బేగంబజార్‌లో ప్రతాప్‌కుమార్‌ గుట్కా తెప్పిస్తున్నాడని తెలుసుకున్నారు. వారం రోజుల క్రితం ప్రతాప్‌ వద్దకు వెళ్లారు. రూ.1.50 లక్షల గుట్కా కావాలని కోరారు. దిల్లీ నుంచి ఆర్‌జే14జీఎఫ్‌ 8095 నంబర్‌ లారీ ఐదురోజుల్లో నగరానికి చేరుకుంటుందని ప్రతాప్‌ వివరించాడు. లారీ నంబర్‌ ఆధారంగా అది ఎక్కడ, ఏ మార్గంలో వస్తోందని గుర్తించారు. బేగంబజార్‌లో శనివారం ఉదయం ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు బృందం లారీని స్వాధీనం చేసుకున్నారు. గుట్కాతో పాటు విదేశీ సిగరెట్లను సీజ్‌ చేశారు.

పాతబస్తీలో.. మరో ఘటనలో నాగ్‌పూర్‌, నాందేడ్‌, బీదర్‌ నుంచి సరకు రవాణా వాహనాల్లో పాతబస్తీకి వస్తున్న గుట్కా సంచులను దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్‌ అజామ్‌, అబూబకర్‌ బిన్‌ ఇలియాస్‌, ఒమర్‌ బిన్‌ అలీలను అరెస్ట్‌ చేశారు. రూ.30.18లక్షల విలువైన గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. 15 రోజుల్లోనే ఇన్‌స్పెక్టర్లు రాఘవేంద్ర, శ్రీనివాస్‌ల బృందం 32 మంది వ్యాపారులను అరెస్ట్‌ చేసిందని వివరించారు. వీరంతా రిటైల్‌ వ్యాపారులకు అమ్ముతున్నారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని