Agrigold: మాజీ కానిస్టేబుల్‌ అగ్రిగోల్డ్‌ బినామీనే!
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 07:47 IST

Agrigold: మాజీ కానిస్టేబుల్‌ అగ్రిగోల్డ్‌ బినామీనే!

ఏడేళ్ల ఆదాయమే రూ.45 లక్షలు
వేలంలో రూ.15 కోట్లకు బిడ్డింగ్‌
సీఐడీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు

ఈనాడు, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ సంస్థకు మాజీ కానిస్టేబుల్‌ బసిరెడ్డి నరేందర్‌రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు తెలంగాణ సీఐడీ దర్యాప్తులో బహిర్గతమయ్యాయి. ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తుల్ని తిరిగి దక్కించుకునేందుకు ఆ సంస్థ నిర్వాహకులే అతడిని బినామీగా ప్రయోగించారనే దిశగా చేపట్టిన దర్యాప్తులో సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు. గత కొన్నేళ్లుగా అతడు లెక్కల్లో చూపుతున్న ఆదాయ వివరాలను ఆరా తీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఏడేళ్లుగా కేవలం రూ.45.76 లక్షల ఆదాయమే సమకూరినట్లు నరేందర్‌రెడ్డి ఆదాయపన్ను శాఖకు సమర్పించిన రిటర్న్‌ల్లో పేర్కొన్నట్లు గుర్తించారు. అలాంటప్పుడు ఏకంగా రూ.15.18 కోట్ల ఆస్తులను దక్కించుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొనడాన్ని బట్టే అగ్రిగోల్డ్‌ సంస్థకు అతడు బినామీగా వ్యవహరించాడని బలంగా నమ్ముతున్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లికి చెందిన అతడు గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతడు అంత భారీ మొత్తంతో బిడ్డింగ్‌లో పాల్గొనడంతో సీఐడీకి అనుమానమొచ్చింది.
156 ఎకరాల కొనుగోలు కోసం...
అగ్రిగోల్డ్‌ ఫామ్స్‌ ఎస్టేట్స్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌ సంస్థ ఐదు రాష్ట్రాల్లో 42,811 మంది ఏజెంట్లను నియమించుకుని 2.57 లక్షల మంది పెట్టుబడిదారుల నుంచి రూ.425.36 కోట్లను సేకరించింది. ఆ నిధుల్ని మళ్లించి దాదాపు 2,080 ఎకరాలు కొనుగోలు చేసింది. డబ్బులు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసిన నేపథ్యంలో సంస్థకు చెందిన ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మోసంపై తెలంగాణ సీఐడీ దర్యాప్తు చేపట్టి 2016లో సంస్థ పేరిట ఉన్న స్థిరాస్తుల్ని జప్తు చేయించింది. అలా స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ గ్రామానికి చెందిన 156 ఎకరాల 15 గుంటల స్థలాన్ని 2019 మార్చిలో ప్రభుత్వం వేలం వేసింది. ఆ వేలంలో పాల్గొన్న నరేందర్‌రెడ్డి రూ.15.18కోట్ల బిడ్డింగ్‌ దాఖలు చేసి ఆ స్థలాన్ని దక్కించుకున్నారు. దాన్ని ఇంకా అప్పగించాల్సి ఉంది.
గతంలోనూ ప్రయత్నాలు
అగ్రిగోల్డ్‌ సంస్థ సీఎండీ అవ్వా సీతారామారావు డైరెక్టర్‌గా ఉన్న శక్తి టింబర్‌ ఎస్టేట్‌ పేరిట గల 8 ఎకరాల 11 గుంటల స్థలాన్ని కొనేందుకు మహబూబ్‌నగర్‌-1 జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గతంలోనే నరేందర్‌రెడ్డి డాక్యుమెంట్‌ సమర్పించారు. ఆ స్థలం క్రయవిక్రయాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు సీఐడీకి సమాచారం అందించారు. దీంతో ఆ స్థలం అమ్మకుండా గత జనవరిలో సీఐడీ.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించింది. ఈ నేపథ్యంలో తాను వేలంలో దక్కించుకున్న మిడ్జిల్‌ స్థలం అప్పగించేలా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలంటూ నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో సీఐడీ అధికారులు మరోమారు ఇతడి వ్యవహారంపై దృష్టి సారించారు. అతడి ఆదాయ వ్యయాలపై ఆరా తీశారు. ఆదాయపన్ను శాఖ కార్యాలయం నుంచి వివరాలు సేకరించారు. అతడి ఆదాయానికి.. వేలంలో దాఖలు చేసిన బిడ్డింగ్‌కు పొంతనే లేదని తేలింది. దీంతో నరేందర్‌రెడ్డి బినామీ వ్యవహారంపై మరింతగా కూపీ లాగుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని