కేరళకు బదిలీ చేశారని కక్ష తీర్చుకున్నాడు!

తాజా వార్తలు

Updated : 13/07/2021 07:23 IST

కేరళకు బదిలీ చేశారని కక్ష తీర్చుకున్నాడు!

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, నారాయణగూడ: భువనేశ్వర్‌ నుంచి కేరళకు తనను ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేశారన్న కక్షతో మణప్పురం గోల్డ్‌ సంస్థలో పనిచేస్తున్న ఓ మాజీ ఉద్యోగి.. తన స్నేహితుల సాయంతో రూ.30 లక్షలు కొట్టేశాడు. అనంతరం వాటాలేసుకుని పంచుకున్నారు. ఐఫోన్లు కొన్నారు. సదరు సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భువనేశ్వర్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాన నిందితుడితో సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి సోమవారం నగరానికి తీసుకొచ్చామని, విచారణ అనంతరం జైలుకు తరలించామని హైదరాబాద్‌ సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిభూషణ్‌ తెలిపారు. వీరి బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన రూ.10 లక్షలు స్తంభింపజేశామని, ఆరు చరవాణులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
కేరళ వెళ్లి... రాజీనామా చేసి..
మణప్పురం భువనేశ్వర్‌ శాఖలో ఆదిత్యనారాయణ్‌ మహాపాత్రో(22) పనిచేస్తున్నాడు. బాగా పనిచేయడంతో మరింత నైపుణ్యం సాధించేందుకుగానూ అతన్ని రెండు నెలల క్రితం కేరళకు బదిలీ చేశారు. తాను వెళ్లనూ అని చెప్పినా పంపించారు. దీంతో కొద్దిరోజుల పాటు అక్కడున్నాడు. స్థానిక వాతావరణంలో ఇమడలేక భువనేశ్వర్‌కు వచ్చి, రాజీనామా చేశాడు. తనను ఉద్దేశపూర్వకంగానే కేరళకు పంపించారని భావించిన అతను.. సంస్థమీద కోపం తీర్చుకునేందుకు తన స్నేహితులు లక్ష్మీధర్‌ ముర్ము(21), ప్రమోద్‌ నాయక్‌ (23), సౌమ్యరంజన్‌ పట్నాయక్‌ (21), దేవాశిష్‌ ఓఝా(20)లను సాయం అడిగాడు. వారు అంగీకరించడంతో పథకం సిద్ధం చేశాడు.
యూజర్‌ ఐడీలు కాజేసి..
మణప్పురం సంస్థ కొద్దినెలల క్రితం ఇంటివద్దకే బంగారం రుణం పథకాన్ని ప్రవేశపెట్టింది.  సదరు ఉద్యోగులు.. సంస్థ వెబ్‌సైట్‌లో తమ యూజర్‌ ఐడీతో లాగిన్‌ అయ్యి వినియోగదారుల వివరాలు నమోదు చేస్తే, వారి ఖాతాల్లోకి నగదు మళ్లుతుంది. ఈ ప్రక్రియను అనుకూలంగా మలచుకుని అతను.. హిమాయత్‌నగర్‌లోని మణప్పురం గోల్డ్‌ కార్యాలయానికి గతనెల 24న ఫోన్‌ చేశాడు. కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, ఇద్దరు ఉద్యోగుల యూజర్‌ ఐడీలు కావాలన్నాడు. వారు ఇవ్వగానే.. ఇద్దరి పేర్లతో నకిలీ వివరాలు సృష్టించి, రూ.15 లక్షల చొప్పున బ్యాంక్‌ ఖాతాల్లోకి జమచేసుకున్నాడు. రూ.30 లక్షలకు సరిపడా బంగారు ఆభరణాలు రాలేదంటూ కార్యాలయ ఉద్యోగులు చూసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని