మలుపు తిరిగిన నిరుద్యోగి ఆత్మహత్య కేసు

తాజా వార్తలు

Updated : 20/07/2021 05:37 IST

మలుపు తిరిగిన నిరుద్యోగి ఆత్మహత్య కేసు

ప్రధాన సూత్రధారి పరారీ 

మరో వ్యక్తి అరెస్టు

పెనుబల్లి, న్యూస్‌టుడే: నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేయడమే గాక వారి ఆత్మహత్యలకూ దళారులు కారణమవుతున్నారని కల్లూరు ఏసీపీ వెంకటేశ్‌ తెలిపారు. పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి సానిక నాగేశ్వరరావు ఈనెల 13న ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసు విచారణలో మరికొన్ని కోణాలూ వెలుగుచూస్తున్నాయి. ఆ వివరాలను సోమవారం వీఎం బంజర్‌ పోలీసు స్టేషన్‌లో ఏసీపీ వెంకటేశ్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన సానిక నాగేశ్వరరావు ఎంఏ ఎకనామిక్స్‌ చదివి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. ఈ నెల 13న ఇంట్లోని కలుపు మందు తాగి గ్రామ శివార్లోని ఓ జామాయిల్‌ తోటలో పడిపోయి కనిపించాడు. కల్లూరులో వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఉద్యోగం రాలేదన్న మనోవ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి వెంకటరామయ్య ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా పలు అంశాలు వెలుగుచూశాయని ఏసీపీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... నెలలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సానిక నాగేశ్వరరావు నుంచి భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురానికి చెందిన మద్దిశెట్టి సామేలు అనే వ్యక్తి రూ.5.5 లక్షలను జనవరిలో తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో మృతునికి వరుసకు సోదరుడైన స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు సానిక చెన్నారావు మధ్యవర్తిగా ఉన్నాడు. పలుమార్లు ఉద్యోగం కోసం సామేలుని అడిగినా ఇదిగో అదిగో అంటూ ఆరు నెలలు గడిపాడు. పేద కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు అతనికి డబ్బు ఇచ్చేందుకు పొలాన్ని రూ. 5 లక్షలకు, మరో రూ. 50వేల కోసం తల్లి మెడలోని పుస్తెలతాడునూ తాకట్టు పెట్టాడు. అటు ఉద్యోగం రాక, ఇటు డబ్బూ తిరిగి రాకపోవడంతో మనస్తాపంతో బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం సామేలు, చెన్నారావు పథకం ప్రకారం ‘చదువుకున్నా, ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని’ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయిస్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని అతని తండ్రిని నమ్మించి ఆమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు విచారణ చేపట్టడంతో భయపడ్డ సామేలు ఈ నెల 15న రూ.5.5లక్షలు చెన్నారావు ఖాతాకు జమ చేశాడు. చెన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించారు. మద్దిశెట్టి సామేలు పరారయ్యాడు. అతనిపై జిల్లాలో పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఏసీపీ తెలిపారు. గ్రామీణ సీఐ టి.కరుణాకర్‌, ఎస్సై తోట నాగరాజు, శిక్షణ ఎస్సై టి.కవిత ఉన్నారు.

రౌడీషీటర్‌ సామేలు రూటే సెపరేటు.. తెల్లని దుస్తులు ధరించడం.. నలుగురు అనుయాయులతో కారులో నుంచి దర్జాగా దిగటం... ఎంత పెద్ద నాయకుడో అనుకునేలా వ్యవహరించటం సామేలు నైజం. పలు గ్రామాల్లో కొందరు ఏజెంట్లను కమీషన్‌పై నియమించుకొని ‘పెద్దపెద్ద అధికారులతో పరిచయం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు కోసం కొంత డబ్బు చెల్లిస్తే ఉద్యోగం వస్తుందని’ ప్రచారం చేయించి అమాయక నిరుద్యోగులను మోసగించేవాడు. అతనిపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. దమ్మపేట స్టేషన్‌లో 2011లోనే రౌడీషీట్‌ నమోదైంది. పోడు భూములకు పట్టాలిప్పిస్తానని కూడా అమాయక గిరిజనుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశాడనే ప్రచారం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని