భవనంపై నుంచి జారిపడి యువకుడి దుర్మరణం

తాజా వార్తలు

Updated : 25/09/2021 06:39 IST

భవనంపై నుంచి జారిపడి యువకుడి దుర్మరణం


బనవాసి సోను (పాతచిత్రం)

పీఎంపాలెం: జీవవభృతి కోసం వేల కిలోమీటర్లు దాటి నగరానికి వచ్చిన ఓ యువ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి శుక్రవారం మృతి చెందాడు. మధురవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసుస్టేషన్‌ సీఐ ఎ.రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బనవాసి సోను(22) కూలి పనుల కోసం తమ ప్రాంతానికి చెందిన కొంతమంది బృందంతో కలిసి మూడు నెలల క్రితం నగరానికి వచ్చాడు. మధురవాడ ఐటీ హిల్స్‌కు వెళ్లే రోడ్డులో ఓ బహుళ అంతస్థు భవన సముదాయం వద్ద పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం నడుముకు బెల్ట్‌ చుట్టుకుని ఆరంతస్థుల పైనుంచి తాడుతో వేలాడుతూ రంగులు వేస్తుండగా ఒక్క సారిగా బెల్ట్‌ తెగి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కేజీహెచ్‌ శవాగారానికి తరలించి ఎస్సై శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

బంధువులను పరామర్శించి ఇంటికి వెళ్తూ...

వేపగుంట, న్యూస్‌టుడే: బంధువుల ఇంటిలో ఒకరు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపాలెం గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరావు(45) చింతలగ్రహారంలోని తన బంధువుల ఇంటిలో ఓ వ్యక్తి మరణించారని అతని కుటుంబీకులను పరామర్శించేందుకు శుక్రవారం వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా చీమలాపల్లి రహదారిలో బ్రహ్మంగారి మఠం సమీపంలో రహదారి పక్కన మరణించి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని