కొవిడ్‌ వచ్చిందని రూ.కోటి నొక్కేశారు!

తాజా వార్తలు

Published : 29/09/2021 02:12 IST

కొవిడ్‌ వచ్చిందని రూ.కోటి నొక్కేశారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సోకి ఆర్థికంగా తలకిందులైన ఎన్నో కుటుంబాలను చూశాం. అన్ని రకాలుగా కుదేలైన వాళ్ల పరిస్థితి చూస్తే అయ్యోపాపం అంటాం. అలా ‘జాలి’ చూపించడమే ఓ వ్యక్తిని నిండా మునిగేలా చేసింది. కొవిడ్‌ పేరు చెప్పి ఆ ముంబయి వాసి నుంచి ఏకంగా రూ.1.3 కోట్లు కొట్టేశారు కిలేడీ తల్లీ కూతుళ్లు. ఆరునెలల తర్వాత ఆ మోసగాళ్లను ఉత్తర ముంబయి సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

59 ఏళ్ల బాధితుడు ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉన్నతోద్యోగి. ఆరునెలల కిందట ఒక సామాజిక మాధ్యమంలో 46 ఏళ్ల మహిళ పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే ఇద్దరు సన్నిహితులయ్యారు. తర్వాత తను కథలు చెప్పడం మొదలుపెట్టింది. తన భర్త, పెద్దకూతురు కొవిడ్‌తో చనిపోయారనీ, బిల్లులు కడితేనే ఆసుపత్రి వాళ్లు మృతదేహాలు అప్పగిస్తామని అంటున్నారని నమ్మబలికింది. అదంతా నమ్మి బాధితుడు అడిగినంతా డబ్బు ఇచ్చాడు. అయినా ఆమె ఆశ తీరలేదు. కొద్దిరోజులకు ఆ మహిళ చిన్న కూతురినంటూ 22 సంవత్సరాల అమ్మాయి రంగంలోకి దిగింది. ‘మా అమ్మ కూడా కరోనా బారిన పడింది. వైద్య ఖర్చులకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలి’ అని అడిగింది. అప్పుడు కూడా ఆ వ్యక్తి గుడ్డిగా నమ్మేసి భారీగా మొత్తం ఇచ్చాడు.

కొన్నాళ్లకు ఆ కిలేడీ మరో నాటకానికి తెర తీసింది. అమ్మ చనిపోయింది. అంత్యక్రియలు కూడా డబ్బులు లేవంటూ అడిగింది. కొద్దిరోజులయ్యాక మాకున్న ఆస్తులు అమ్మి మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికింది. అమాయకంగా ఆ మాటలు నమ్మాడు తను. కొన్నాళ్లయ్యాక డబ్బులు ఇవ్వమని ఆ కూతురిని అడిగితే.. తల్లీకూతుళ్లిద్దరూ సోషల్‌ మీడియా ఖాతాలు తొలగించి పత్తా లేకుండా పోయారు. అప్పుడు అనుమానం వచ్చిన ఆ పెద్ద మనిషి సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌ దేశాయ్‌ రంగంలోకి దిగి కిలేడీల కోసం గాలింపు చేపట్టారు. చివరికి వారిద్దరూ ముంబయి సమీపంలోని భివాండిలో పట్టుబడ్డారు. వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో బంగారం, రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని