నిమజ్జనోత్సవంలో విషాదం

తాజా వార్తలు

Updated : 18/10/2021 05:50 IST

నిమజ్జనోత్సవంలో విషాదం

ఇద్దరు మృత్యువాత

కల్లూరు, పెనుబల్లి, న్యూస్‌టుడే: బతుకమ్మ నిమజ్జన్సోతంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన కల్లూరు మండలం రఘునాథగూడెంలో శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకొంది. ప్రమాదంలో శ్రీగంధం మధులత(26), పసుపులేటి శివ(23) మృతి చెందారు. రఘునాథగూడెంలో ఊరేగింపు అనంతరం స్థానిక సాగర్‌ కాలువలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు మధులత నీళ్లలో జారిపడిపోయింది. ఆమెను కాపాడేందుకు శివ కాలువలో దిగడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. తెల్లవారుజామున మధులత మృతదేహం లభ్యం కాగా, శివ మృతదేహాన్ని గజఈతగాళ్లు ఆదివారం మధ్యాహ్నం వెలికితీశారు. ప్రమాద స్థలాన్ని సీఐ కరుణాకర్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఫీ తెలిపారు.


పండక్కి వచ్చి..

రఘునాథగూడేనికి చెందిన మధులత కు పెనుబల్లి మండలం భవన్నపాలేనికి చెందిన శ్రీగంధం రాధాకృష్ణతో మూడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ప్రైవేటు ఉద్యోగి. కృష్ణా జిల్లా తిరువూరులో వీరు నివాసముంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. పండక్కి పుట్టింటికి వచ్చిన మధులత బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంది. నిమజ్జనం సందర్భంగా గ్రామస్థులతో కలిసి సంతోషంగా వెళ్లి సాగర్‌ కాలువలో ప్రమాదవశాత్తు జారి మృత్యువాత పడింది. తల్లి ఇక లేదనే విషయమూ రెండేళ్ల బాబు గుర్తించలేని పరిస్థితి. భర్త స్వగ్రామం పెనుబల్లి మండలం భవన్నపాలెంలో మధులత అంత్యక్రియలు నిర్వహించారు.


అందివచ్చిన కొడుకు దూరమై...

డిగ్రీ వరకు చదివిన పసుపులేటి శివ హైదరాబాద్‌లో తన మేనమామ వద్ద స్వీట్ల తయారీ దుకాణంలో శిక్షణ పొందుతున్నాడు. తల్లిదండ్రులు రామయ్య, ధనమ్మలు వ్యవసాయ కూలీలు. పండక్కి వచ్చిన కుమారుడు అంతలోనే విగతజీవిగా ఇంటికి చేరటంతో ఆ తల్లిదండ్రులు గుండెలివిసేలా రోదించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని