Crime News: విమానాల్లో వస్తారు.. ఏటీఎంలు దోచేస్తారు

తాజా వార్తలు

Updated : 27/10/2021 09:34 IST

Crime News: విమానాల్లో వస్తారు.. ఏటీఎంలు దోచేస్తారు

హరియాణా ముఠా అరెస్టు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆరుగురు సభ్యుల ముఠా.. అందరిది హరియాణా.. విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. కేవలం ఒకే కంపెనీ ఏటీఎంలు దోచుకెళ్తారు. డిజిటల్‌ కీల సాయంతో కొన్నేళ్లుగా ఏటీఎంల్లో దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ నెల 16న రాత్రి 7.30కు ఓ అనుమానిత లావాదేవీ జరిగింది. అప్పటికే సీసీ కెమెరాల ద్వారా విషయాన్ని గుర్తించిన బ్యాంకు సిబ్బంది మేనేజర్‌కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలో దిగి కేంద్రాన్ని పరిశీలించారు. అరగంట వ్యవధిలో డిజిటల్‌ కీ సాయంతో రూ.30 వేలు నగదు డ్రా చేసి తప్పించుకొన్నట్లు గుర్తించారు. సీసీ టీవీ దృశ్యాల సాయంతో రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు బస చేసినట్లు తెలియడంతో తనిఖీలు చేశారు. ఎట్టకేలకు నిందితులు మహమ్మాద్‌ అల్తాబ్‌, వకీల్‌ అహ్మద్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి రూ.30 వేల నగదు, రెండు చరవాణులు, రెండు ఏటీఎం మానిటర్‌ డిజిటల్‌ కీలు, వివిధ బ్యాంకులకు చెందిన 11 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకొన్నట్లు ఏసీపీ తెలిపారు.

నగదు విత్‌డ్రా సమయంలో..
హరియాణాలోని పాల్వాల్‌ జిల్లాకు చెందిన షాకీర్‌ ఆధ్వర్యంలో అల్తాబ్‌, వకీల్‌ అహ్మద్‌, అమీర్‌ సోహెల్‌, ఆషిక్‌, ఇన్సాఫ్‌ ఓ ముఠాగా ఏర్పడి హ్యోసంగ్‌ కంపెనీ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తున్నారు. తొలుత ఒక రాష్ట్రాన్ని ఎంచుకున్నాక విమానంలో అక్కడికి వెళ్తారు. చోరీకి అనుకూలంగా ఉన్న ఏటీఎం కేంద్రాన్ని గుర్తించి సమీపంలోని లాడ్జిల్లో దిగుతారు. రాత్రివేళల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా బయటికొస్తారు. వారి దగ్గర ఉన్న డెబిట్‌ కార్డులతో నగదు విత్‌డ్రా చేస్తారు. సరిగ్గా యంత్రంలో నుంచి నగదు వచ్చే సమయంలో డిజిటల్‌ కీల సాయంతో సెన్సార్‌ పనిచేయకుండా చూసుకుంటారు. దీంతో డబ్బులు విత్‌డ్రా జరిగినా ఖాతాలో చూపించదు. ఇలా వివిధ కార్డులతో రూ.లక్షల్లో నగదు తీసుకొని ఆ రాష్ట్రం నుంచి ఉడాయిస్తారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు, ఎస్సై నర్సింలు, సిబ్బంది నర్సింగ్‌రావు, రహీం, శ్రీనివాస్‌ బృందాన్ని ఏసీపీ అభినందించారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డెబిట్‌కార్డులు, డిజిటల్‌ కీలు, చరవాణిలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని