అధ్యయనం చేసి.. నిధులు కాజేసి!

తాజా వార్తలు

Published : 27/10/2021 12:37 IST

అధ్యయనం చేసి.. నిధులు కాజేసి!

తెలుగు అకాడమీ వ్యవహారంలో నిందితుల పక్కాప్రణాళిక

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా చేయించి వాటిలో కోట్లు కొల్లగొట్టిన సాయికుమార్‌ బృందం... ఎఫ్‌డీలను కాజేసే ముందు ఆయా నిధులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సాయికుమార్, యూబీఐ, కెనరాబ్యాంక్‌ మాజీ మేనేజర్లు మస్తాన్‌వలీ, సాధన, తెలుగు అకాడమీ ఏవో రమేష్, పొరుగుసేవల ఉద్యోగి వినయ్‌ను వేర్వేరుగా విచారించినప్పుడు అకాడమీ నిధులకు సంబంధించిన వివరాలను వారు చెప్పారు. అకాడమీకి వివిధ బ్యాంక్‌ల్లో రూ.215 కోట్ల నిధులున్నాయన్న సమాచారం ఉద్యోగులు, బ్యాంక్‌ మేనేజర్ల నుంచి సాయికుమార్‌ సేకరించాడు. వీటిలో ఏ బ్యాంకులు అనుకూలంగా ఉన్నాయని అధ్యయనం చేసిన అనంతరం యూబీఐ, కెనరా బ్యాంక్‌ మేనేజర్లను ఎంచుకొని అనుచరులు, ఏపీ సహకార మర్చంటైల్‌ క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌తో కలిసి రూ.64.05 కోట్లు కాజేశారు.

చివరి నిమిషంలో వెనక్కి..

ఎఫ్‌డీల స్వాహా కొనసాగుతుండగానే.. జూబ్లీహిల్స్‌లోని ఓ బ్యాంక్‌లోనూ అకాడమీ నిధులు డిపాజిట్‌ చేయించి వాటిని కాజేయాలని అనుకొన్నాడు సాయికుమార్‌. ఈ ఏడాది మార్చిలో జూబ్లీహిల్స్‌లోని ఓ జాతీయ బ్యాంక్‌ను ఎంపిక చేసుకొన్నాడు. తన అనుచరులు నండూరి వెంకటరమణ, డాక్టర్‌ వెంకట్, కృష్ణారెడ్డిని వారం రోజులు పంపించాడు. అక్కడున్న అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వ్యక్తిగత వివరాలు సేకరించాడు. గతంలో తనకు సాయం చేసిన వేర్వేరు బ్యాంక్‌ల మాజీ అధికారుల సాయంతో అక్కడ ఓ అధికారిని కలుసుకొన్నాడు. ఆ బ్యాంకులో అప్పటికే తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని తెలుసుకొని. ఇదే బ్యాంక్‌లో అకాడమీ పేరుతో ఎఫ్‌డీలు తీయడం సాధ్యం కాదని చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడు.
ఏం కొన్నారు? ఏం చేశారు?సాయికుమార్‌ బృందం రూ.64.05 కోట్లతో ఏం చేశారు? ఏం కొన్నారు? అనేది సీసీఎస్‌ పోలీసులు పరిశోధన కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల స్థిరచరాస్తులను గుర్తించినట్లు ఏసీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. తాను ముంబయిలో ఒకరికి రూ.2 కోట్లు, దుబాయ్‌లో మరొకరికి రూ.5 కోట్లు ఇచ్చానంటూ సాయికుమార్‌ చెప్పిన వివరాలను సరిపోల్చుతున్నారు. ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ముగిశాక వాటిని కోర్టుకు స్వాధీనం చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని