close

తాజా వార్తలు

Updated : 24/11/2020 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేతబడి చేయించాడనే అనుమానం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సజీవ దహనం

మరో ఘటనలో రైతు హత్య
మూఢనమ్మకాలతో అఘాయిత్యాలకు పాల్పడిన బంధువులు
జగిత్యాల, కుమురం భీం జిల్లాల్లో  దారుణాలు

మల్యాల, తిర్యాణి, న్యూస్‌టుడే: అభివృద్ధిలో దేశం కొత్త పుంతలు తొక్కుతున్నా..ప్రజలు ఆధునిక పోకడలను వంటబట్టించుకున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ అమానుషాలకు ఒడిగడుతున్నారు. అనుమానాలతో అమాయకులను అతిదారుణంగా హతమారుస్తున్నారు. బాధితుల కుటుంబాలకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు ఇటువంటి అనుమానాలతో దారుణహత్యలకు గురయ్యారు. అందులో ఒకరు పరామర్శకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావడం గమనార్హం.
పరామర్శకు వెళ్తే మృత్యువు ఎదురొచ్చింది
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌ శివారులో హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు రాచర్ల పవన్‌కుమార్‌(38)ను సమీప బంధువులే సోమవారం రాత్రి సజీవ దహనం చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. జగిత్యాలకు చెందిన విజయ్‌.. కొండగట్టుకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో మంజునాథ ఆలయాన్ని, దాని పక్కనే కుటీరాన్ని నిర్మించుకున్నారు. 12 రోజుల కిందట విజయ్‌ తమ్ముడు జగన్‌ అనారోగ్యంతో మృతి చెందారు. విజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్‌కుమార్‌, భార్య కృష్ణవేణితో కలిసి సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మంజునాథ ఆలయానికి చేరుకున్నారు. పవన్‌కుమార్‌ చేతబడి చేయించి తన భర్తను చంపించాడనే అనుమానంతో అక్కడే ఉన్న జగన్‌ భార్య సుమలత ఆయన్ని కుటీరంలోని ఓ గదిలో బంధించింది. ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈ మేరకు మృతుని భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి గది తాళం తీసే సరికే పవన్‌కుమార్‌ పూర్తిగా దహనమయ్యాడని సీఐ కిషోర్‌ తెలిపారు. గది బయట తాళం వేసి ఉండటాన్ని బట్టి మరికొందరు కూడా ఈ అఘాయిత్యంలో పాలుపంచుకుని ఉంటారనే అనుమానాన్ని సీఐ వ్యక్తంచేశారు. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మంగళవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు.
మంత్రాలు వేశాడని
కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం భీంజీగూడ పంచాయతీ తాటిమాదర గ్రామానికి చెందిన రైతు ఆత్రం లచ్చు(40)కు పుర్కగూడ సమీపంలో ఆరెకరాల పొలం ఉంది. ఆదివారం రాత్రి కాపలా కోసం పొలం వద్దకు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం వరకూ ఇంటికి రాలేదు. పొలం వద్దనే రక్తపుమడుగులో మృతిచెంది ఉండగా స్థానిక రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదే గ్రామానికి చెందిన ఆత్రం అర్జు(56) ఇరవై రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, లచ్చు కుటుంబం మంత్రాలు వేయడం వల్లనే ఆయన మృతి చెందినట్లు ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాలు ఇటీవల గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో అర్జు బంధువులే తన భర్తను హత్య చేశారని లచ్చు భార్య మైనుబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన