కన్నీటి ఊట
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 11:36 IST

కన్నీటి ఊట

పుట్టువెంట్రుకల వేడుకకు వచ్చిన వారిలో ఆరుగుర్ని బలిగొన్న గోదావరి
రోడ్డు ప్రమాదాల్లో సర్పంచి కుటుంబం సహా ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
ఎలుకల మందు కలిసిన పుచ్చకాయ తిని ఇద్దరు..
 గడ్డివాము అంటుకుని మరో ఇద్దరు పిల్లల మృత్యువాత
నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో దుర్ఘటనలు

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’ అన్నట్టు అనుకోని ప్రమాదాలతో శుక్రవారం తెలంగాణలోని పల్లెల్లో కన్నీరుపారింది. వేర్వేరు ఘటనల్లో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోగా, ఎన్నో కుటుంబాలను విషాదం ముంచెత్తింది. నిజామాబాద్‌ జిల్లాలో పుట్టు వెంట్రుకలు తీయించే వేడుకకు హాజరైన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గోదావరి నదిలో ప్రాణాలో కోల్పోయారు. ఒక రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన ఇంటర్‌ చదువుతున్న ముగ్గురు స్నేహితులు, అదే జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో తెప్పలమడుగు సర్పంచి తరి శ్రీను కుటుంబంలోని నలుగురూ కడతేరిపోయారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దొంగాపోలీసు ఆట ఆడే క్రమంలో ట్రాక్టరు చక్రాల్లో దాక్కున్న ఇద్దరు చిన్నారులు అగ్ని కీలల్లో చిక్కుకుని మృత్యు ఒడికి చేరారు. పెద్దపల్లి జిల్లాలో ఎలుక కొరికిన పుచ్చకాయ తిన్న కుటుంబం అస్వస్థతకు గురైంది. ఇద్దరు చిన్నారులు చనిపోగా, వారి తల్లిదండ్రులు, నానమ్మ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయా ఘటనలో ముక్కుపచ్చలారని తొమ్మిది మంది చిన్నారులు అసువులు బాయడం మరింత విషాదానికి కారణమైంది.

నీట మునిగిన బంధాలు
  పుట్టువెంట్రుకల వేడుకలో విషాదం
  గోదావరిలో మునిగి ఆరుగురు మృతి
  మృతుల్లో ముగ్గురు బాలురు

ఈనాడు, నిజామాబాద్‌: పుట్టు వెంట్రుకలు తీయించే వేడుక విషాదాంతమైంది. గోదావరిలో స్నానాలు ఆచరిస్తూ ప్రమాదవశాత్తు మునిగి ఆరుగురు చనిపోయారు. ఒకరిని కాపాడబోయి మరొకరుగా ప్రాణాలు విడిచారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌ ప్రాజెక్టు సమీపంలో జరిగిన ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదానికి కారణమైంది.
మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామానికి చెందిన దొడ్లే భూమయ్య, చిన్నరాజి దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమార్తె సూర రాధ, నరేష్‌ దంపతుల కుమారుడు పుట్టు వెంట్రుకలను మెండోరా మండలం పోచంపాడ్‌ ప్రాజెక్టు సమీపంలో తీయాలని నిర్ణయించారు. దగ్గరి బంధువులంతా ముందే ఇంటికి చేరుకున్నారు. అందరూ శుక్రవారం ఉదయం వ్యాను, ద్విచక్రవాహనాల్లో పోచంపాడ్‌కు బయలుదేరారు. మొక్కులు తీర్చుకోవడానికి ముందు శ్రీరాంసాగర్‌ డ్యామ్‌కు 500 మీటర్ల దూరంలో పుష్కరాల సందర్భంలో నిర్మించిన ఘాట్‌ల వద్ద స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. అందులో భాగంగా తొలుత మహిళలు స్నానాదులు పూర్తిచేసుకొని వంట సిద్ధం చేసే పనిలో ఉన్నారు. తర్వాత పిల్లలు, మగవారు వెళ్లారు.

చిన్నారులను కాపాడే ప్రయత్నంలో..
స్నానాల కోసం అందరూ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నదిలో దిగారు. భూమయ్య కుమార్తె సంధ్య-పోశెట్టి దంపతుల కుమారుడు రవికాంత్‌, మానస-శ్రీనివాస్‌ దంపతుల రెండో కుమారుడు శ్రీకర్‌(14) నీటిలో మునిగిపోతూ కేకలు వేశారు. వీరిని కాపాడే ప్రయత్నంలో భూమయ్య కుమారుడు దొడ్లే రాజు(24), ఆయన పెద్ద అల్లుడు సురేష్‌(40), మనవడు యోగేష్‌(16) నదిలో మునిగిపోయారు. శ్రీకర్‌ తండ్రి శ్రీనివాస్‌(40), సోదరుడు సిద్ధార్థ్‌(16) కూడా ఇదే తరహాలో నీటమునిగారు. వీరిలో రవికాంత్‌ను స్థానికులు రక్షించారు. మిగతా ఆరుగురు మృతి చెందారు. ఈ పరిణామాలన్నీ 15 నిమిషాల్లోనే జరిగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వందల మంది చూస్తుండగానే
రాజు, సురేష్‌, శ్రీనివాస్‌లకు ఈత బాగా వచ్చని, అయినా వారు మునిగిపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు. నిర్మల్‌ జిల్లా లక్ష్మణ్‌చాంద ప్రాంతంలో ఆయకట్టుకు నీటిని అందించడానికి ప్రాజెక్టు అధికారులు సదర్‌మట్‌ కాల్వ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో గోదావరి నదిలో ప్రవాహం ఉంది. ఘటన జరిగిన చోట 20 అడుగుల లోతు ఉంది. నీళ్లు సుడులు తిరుగుతుండటంతో బాధితులు ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు పేర్కొన్నారు. వందల మంది భక్తులు, కుటుంబ సభ్యులు ఒడ్డుపై నుంచి ప్రత్యక్షంగా చూస్తుండగా వీళ్లంతా నీటమునగడంతో ఆ ప్రాంతంలో, గ్రామంలో విషాదం అలముకుంది.  
మూడు కుటుంబాల్లో విషాదం
ఈ ప్రమాదంలో మరణించిన సురేష్‌ భూమయ్య పెద్ద కుమార్తె వసంత భర్త. యోగేష్‌ వారి కుమారుడు. రాధా పెద్దమ్మ కుమార్తె మానస భర్త శ్రీనివాస్‌, ఆమె ఇద్దరు కుమారులు మృత్యువాతపడటంతో ఆమె ఒంటరయ్యారు. ఘటనా స్థలంలో ఆమె గుండెలవిసెలా రోదించడం అక్కడున్నవారిని కంట తడిపెట్టించింది.
రెండు నెలల్లో పెళ్లి ఉందనగా..
ఈ ప్రమాదంలో మృతి చెందిన భూమయ్య కుమారుడు దొడ్లే రాజుకు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. జూన్‌ 4న ముహూర్తం నిశ్చయించారు. అతన్ని వివాహం చేసుకోబోయే అమ్మాయి కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. తన కళ్లెదుటే కాబోయే భర్త ప్రాణాలు వదలడంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. ఆరు మృతదేహాలకు నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
యంత్రాంగం నిర్లక్ష్యం..
పోచంపాడ్‌ గ్రామం సమీపంలోనే శ్రీరాంసాగర్‌ డ్యామ్‌ ఉంది. దిగువన నదీ పరీవాహక ప్రాంతంలో రెండు పుష్కర ఘాట్లు నిర్మించారు. భక్తులు పర్వదినాల్లో ఇక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. శుక్రవారం గంగమ్మ తల్లికి మొక్కులు సమర్పిస్తారు. ఈ రెండు ఘాట్ల వద్ద నదిలో లోతైన గుంతలు, చుట్టూ బండరాళ్లు ఉన్నాయి. ఎక్కడా హెచ్చరిక బోర్డులు లేవు. లోతైన ప్రాంతానికి వెళ్లకుండా గ్రిల్స్‌, ఇనుప కంచె వంటివీ ఏర్పాటు లేదు. దీంతో తెలియని వారు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రాణం తీసిన సరదా ఆట

నవాబుపేట, పాలమూరు (న్యూస్‌టుడే) : మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామానికి చెందిన మరారి రాము, స్వాతి దంపతులకు నలుగురు సంతానం. పెద్దవాడైన ప్రశాంత్‌ (11) గ్రామంలోనే నాలుగో తరగతి చదువుతున్నాడు. మాధవులు, సువర్ణ దంపతుల ముగ్గురు సంతానంలో చివరివాడు విఘ్నేశ్‌ (9). ఇద్దరూ.. మరో బాలుడితో కలిసి గురువారం సాయంత్రం గ్రామ సమీప పొలంలోని గడ్డివాము వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. దొంగాపోలీస్‌ ఆట ఆడే క్రమంలో ఇద్దరూ ట్రాక్టర్‌ దమ్ము చక్రాల లోపల దాక్కున్నారు. కనిపించకుండా ఉండేందుకు పైన గడ్డి కప్పుకొన్నారు. ఏం జరిగిందో ఏమో! గడ్డికి మంటలు అంటుకోవడంతో చక్రాల్లో ఇరుక్కున్న ఇద్దరూ ఆర్తనాదాలు చేశారు. కేకలు విన్న చుట్టుపక్కల వారు బయటకు తీశారు. అప్పటికే శరీరంలో ఎక్కువ భాగం కాలిపోవడంతో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. 8 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే విఘ్నేశ్‌ మృతి చెందాడు. ప్రశాంత్‌ రాత్రి 10.35 గంటలకు కన్నుమూశాడు.
మంట ఎలా అంటుకుంది?
అగ్గిపుల్లను ఎవరు గీశారు అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారి వెంట ఉన్న బాలుడు గీశాడా? లేదా చనిపోయిన పిల్లల్లో ఒకరు గీశారా? అనేదానిపై స్పష్టత లేదు. గ్రామస్థుల్లో చాలా మంది అక్కడికి దగ్గర్లో బహిర్భూమికి వెళ్తారు. ఆ సమయంలో ఎవరైనా సిగరెట్టు అంటించుకుని అగ్గిపుల్ల విసిరి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎలుకలను చంపబోతే..
  మూషికం కొరికిన పుచ్చకాయ తిని ఇద్దరు అన్నదమ్ముల మృతి
  ప్రాణాపాయస్థితిలో వారి తల్లిదండ్రులు, నానమ్మ

రామగుండం, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఇస్సంపేట గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం పుచ్చకాయలో సగం తిన్నారు. మిగతా భాగాన్ని అల్మరాలో పెట్టారు. మంగళవారం ఎల్లమ్మ కొలుపు జరుపుకొన్నాక రాత్రి దాన్ని తిన్నారు. అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం గ్రామంలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో గురువారం కరీంనగర్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు పిల్లలు దారవేని శివానందు(12), చరణ్‌(10) మృతి చెందారు. వారి తల్లిదండ్రులు శ్రీశైలం, గుణవతి, నానమ్మ సారమ్మలు ప్రాణాపాయస్థితిలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గల కారణంపై పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ‘ఇంట్లో ఎలుకల్ని చంపేందుకు మందు తెచ్చారు. కొంత అక్కడక్కడా చల్లి, మిగిలిన ప్యాకెట్‌ను అల్మరాలో పెట్టారు. దాన్ని తిన్న ఎలుకలు ఇంట్లో అటూఇటూ తిరుగుతూ పుచ్చకాయపై తిరిగి కొంత తిన్నాయి. గుర్తించని కుటుంబ సభ్యులు తినడంతో అస్వస్థతకు గురయ్యారు’ అని పోలీసులు తెలిపారు. పిల్లల మరణించి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరచలేదని వెల్లడించారు.

ఎదురొచ్చిన మృత్యువు
  రోడ్డు ప్రమాదంలో సర్పంచి కుటుంబం దుర్మరణం
  మరో ఘటనలో ముగ్గురు ఇంటర్‌ విద్యార్థులు

నిడమనూరు, పెద్దవూర రూరల్‌, గుర్రంపోడు, హాలియా, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పలమడుగు సర్పంచి తరి శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ముప్పారంలోని బంధువుల ఇంట్లో జరిగే అన్నప్రాసన కార్యక్రమానికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. నిడమనూరు వద్ద మిర్యాలగూడ వైపు నుంచి బియ్యంలోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి...ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని, దాని వెనకనే ఉన్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తరి శ్రీను(40), ఆయన భార్య విజయ(35) లారీ చక్రాల కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొన్న వేగానికి రోడ్డు పక్కన ఎగిరిపడిన వారి కుమార్తె శ్రీవిద్య (7), కుమారుడు వర్షిత్‌ (3) తీవ్ర గాయాలపాలై మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టాటా ఏస్‌లో ప్రయాణిస్తూ గాయపడిన ముప్పారం గ్రామానికి చెందిన మరో ఇద్దరినీ మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.
ఐదేళ్ల క్రితం సోదరుడు
శ్రీను సోదరుడు(అన్న) ఐదేళ్లక్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. తండ్రి చనిపోయినప్పట్నుంచి వాళ్లంతా చిన్నాన్న వద్దే పెరుగుతున్నారు. ఇప్పుడు చిన్నాన్న కూడా మరణించడంతో వారంతా అనాథలయ్యారు.

స్టడీ మెటీరియల్‌ కోసం వెళ్తూ..

నల్గొండ జిల్లా అనుములకు చెందిన బొడ్డుపల్లి మహేశ్‌(18), పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన శివ(18), గుర్రంపోడు మండలం నడ్డివారిగూడెంకు చెందిన నడ్డి శ్రీకాంత్‌(18) చిన్ననాటి స్నేహితులు. ఇంటర్‌ నల్గొండలోని ఒకే కళాశాలలో చదువుతున్నారు. పర్యావరణ పరీక్ష స్టడీ మెటిరియల్‌ తెచ్చుకునే నిమిత్తం శుక్రవారం ముగ్గురూ ద్విచక్ర వాహనంలో హాలియా నుంచి నల్గొండకు బయలుదేరారు. చింతగూడెం స్టేజీ సమీపంలో గొర్రెలను తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రిప్పర్‌ను ఢీకొన్నారు. అక్కడికక్కడే మరణించారు.
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని