AP News: కాగితాలపై స్థలాలు.. రూ.3.26 కోట్లు వసూలు

తాజా వార్తలు

Updated : 13/06/2021 11:43 IST

AP News: కాగితాలపై స్థలాలు.. రూ.3.26 కోట్లు వసూలు

బెజవాడలో స్థిరాస్తి సంస్థ మోసం
బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్న బాధితులు

విజయవాడ (పటమట, కరెన్సీనగర్‌), న్యూస్‌టుడే: సొంతిల్లు కట్టుకోవాలనేవారి ఆశలే వారికి పెట్టుబడి. ఎక్కడా స్థలాలు లేకపోయినా.. కాగితాలపైన భూములను చూపించి, భారీగా వెంచర్లు వేస్తామని నమ్మించారు. అడ్వాన్సుగా రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శనివారం పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులు ఇప్పటివరకు రూ.3.26 కోట్లు వసూలు చేసినట్లు తేలిందని, ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్పారు.
పోలీసులు, బాధితుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు, విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామస్థుడు ఉప్పు మనోజ్‌కుమార్‌, కృష్ణా జిల్లా యద్దనపూడికి చెందిన బలగం రవితేజలు గత ఆగస్టులో విజయవాడ మహానాడు రోడ్డులోని శ్రీరామచంద్రనగర్‌లో ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ పేరిట కార్యాలయం తెరిచి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. స్థలాలు అమ్మినందుకు కమీషన్‌ చెల్లిస్తామంటూ 20 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి, ముస్తాబాద, గన్నవరం, గుండిమెడ, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ప్రకాశం జిల్లాలోని కనిగిరి తదితర ప్రాంతాల్లో వెంచర్లను చూపించి.. ముందుగా డబ్బులు చెల్లించినవారికి తక్కువ ధరలకే ఇళ్లు కట్టించి ఇస్తామని ఆశ చూపారు. దీంతో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కడప, శ్రీశైలానికి చెందిన దాదాపు 100 మంది పెద్ద ఎత్తున అడ్వాన్సులు చెల్లించారు. చాలా మంది ఏజెంట్లు కూడా సొంతింటి కోసం అడ్వాన్సులు కట్టారు. వారు రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఒత్తిడి చేయడంతో నిర్వాహకులు ఈ ఏడాది మార్చిలోనే విజయవాడ కార్యాలయాన్ని మూసివేసి హైదరాబాద్‌కు మకాం మార్చారని సమాచారం. బాధితులు వారికి ఫోన్‌ చేయగా సరైన సమాధానం చెప్పలేదు. మే 2 నుంచి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించారు. మే 24న నందిగామకు చెందిన ఓ ఏజెంట్‌ దీనిపై విజయవాడ సెంట్రల్‌ కంప్లయింట్‌ సెల్‌కు పోస్ట్‌ ద్వారా ఫిర్యాదు చేయగా, దానిని అక్కడ నుంచి పటమట పోలీసులకు పంపించారు.
రాజమహేంద్రవరం, విశాఖలోనూ మోసాలు
సంస్థ నిర్వాహకుల్లో కీలకమైన శ్రీనివాసరావు.. రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లోనూ గతంలో స్థిరాస్తి వెంచర్లు అంటూ పలువురిని మోసం చేయడంతో కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి విజయవాడ చేరిన శ్రీనివాసరావు ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ప్రమోటర్‌గా చేరాడు. తర్వాత మనోజ్‌కుమార్‌, రవితేజలతో కలసి సొంతంగా సంస్థను ప్రారంభించాడు. హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయం పరిధిలో దాదాపు 40 మంది ఏజెంట్లను నియమించుకున్నారు.
రాజకీయ పలుకుబడి ఉందంటూ బెదిరింపులు
30 మందికిపైగా బాధితులు శనివారం విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తాము పెద్ద మొత్తంలో అడ్వాన్సులు చెల్లించామంటూ ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్‌ ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి, సీఐ సురేష్‌రెడ్డి వీరి నుంచి వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. ఆగిరిపల్లిలోని లేఅవుట్‌లో స్థలం కోసం ముందస్తుగా రూ.5 లక్షలను చెల్లించానని, తన బంధువులైన నాలుగు కుటుంబాలకు ప్లాట్లు కొనుగోలు చేశామని ఓ వ్యక్తి వాపోయారు.స్థలం కొన్నచోట అభివృద్ధి లేకపోవడంతో తాను కట్టిన డబ్బును తిరిగివ్వాలని నిర్వాహకులను కోరగా.. తెలుగు రాష్ట్రాల్లో తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని, ఎవరూ ఏం చేయలేరని బెదిరించారని ఓ బాధితుడు తెలిపారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని