AP News: భార్యను చంపి..బిడ్డ ఎదుటే కాల్చి!

తాజా వార్తలు

Updated : 29/06/2021 12:33 IST

AP News: భార్యను చంపి..బిడ్డ ఎదుటే కాల్చి!

డెల్టాప్లస్‌తో చనిపోయినట్లు నమ్మించిన భర్త

మృతురాలి అక్క కుమార్తె పరిశోధనతో వెలుగులోకి.. 

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్తే భార్యను హతమార్చాడు. కన్నబిడ్డ కళ్లెదుటే మృతదేహాన్ని కాల్చేశాడు. డెల్టాప్లస్‌ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందిందని, ఆసుపత్రి వారు మృతదేహాన్ని ఇవ్వలేదని భార్య బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి అక్క కుమార్తెకు అనుమానం వచ్చి సీసీటీవీ కెమరా ఫుటేజీ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. తిరుపతిలో ఈ నెల 23న వెలుగులోకి వచ్చిన ‘సూట్‌కేసులో కాలిన మృతదేహం’ కేసు ఓ కొలిక్కి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు... కడప జిల్లా బద్వేలుకు చెందిన ఎం.శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని (27) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భువనేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. కరోనావల్ల వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో మూడు నెలల కిందట వీరు తిరుపతి వచ్చి... డీబీఆర్‌రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో ఏడాదిన్నర వయసు పాపతో కలిసి ఉంటున్నారు. పెళ్లయినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి భువనేశ్వరి ఫోన్‌ పని చేయక పోవడంతో పుట్టింటి వారికి అనుమానం వచ్చి శ్రీకాంత్‌రెడ్డిని నిలదీశారు. భువనేశ్వరికి డెల్టాప్లస్‌ వేరియంట్‌ కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు... అక్కడ ఆమె చనిపోవడంతో తనకూ చూపించకుండా దహనక్రియలు చేసినట్లు చెప్పి... వారిని నమ్మించాడు.

ఇలా బట్టబయలు..

భువనేశ్వరి అక్క కుమార్తె మమత కర్నూలు జిల్లా లో ట్రైనీ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆమె భువనేశ్వరి ఉన్న అపార్టుమెంట్‌ సీసీ కెమెరా ఫుటేజీలను తిరుపతి పోలీసుల సహకారంతో రహస్యంగా పరిశీలించారు. ఈ నెల 22న ఉదయం కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డి ఎర్రటి సూట్‌కేసుతో వచ్చాడు. మధ్యాహ్నం అదే సూట్‌కేసును లాక్కొంటూ.. కుమార్తెను ఎత్తుకుని ట్యాక్సీ ఎక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత అతను రుయా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ సమీపంలోకి వెళ్లినట్లు దారిలోని సీసీ కెమెరా ఫుటేజీల్లో చూసి గుర్తించారు. అక్కడ సమీపంలోని పొదల చాటున సూట్‌కేసును తెరిచి మృతదేహాన్ని కాల్చేశాడు. ఆ సమయంలో అతని భుజంపై కన్నబిడ్డ ఉంది. అలిపిరి పోలీసులు ట్యాక్సీ డ్రైవరును అదుపులోకి తీసుకొని విచారించడంతో అతను ఈ విషయాలను నిర్ధారించాడు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని