AP News: ‘మానసికంగా హింసించి చంపేశాడు’

తాజా వార్తలు

Updated : 18/07/2021 07:27 IST

AP News: ‘మానసికంగా హింసించి చంపేశాడు’

అల్లుడిపై మామ ఫిర్యాదు

ముగ్గురు చిన్నారులు, తల్లి మృతి ఘటన

ముగ్గురు చిన్నారులు (పాత చిత్రం)

అరకులోయ, న్యూస్‌టుడే: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా హింసించడంతోపాటు నలుగురి మృతికి కారకుడయ్యాడని ఆరోపిస్తూ అల్లుడిపై మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరకులోయ పట్టణ పరిధి సి కాలనీలో శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో తల్లి, ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలు సురేఖ తండ్రి లక్ష్మయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సురేఖను ఆమె భర్త శెట్టి సంజీవ్‌ మానసికంగా హింసించేవాడు. కొద్దికాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యపై చేయి చేసుకోవడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి భర్తతో కాపురానికి పంపాం. ఈలోగానే ముగ్గురు పిల్లలు, తల్లి విగతజీవులయ్యారు. నలుగురి మృతికి కారకుడైన సంజీవ్‌ను కఠినంగా శిక్షించాలని’ లక్ష్మయ్య కోరారు.

చురుగ్గా దర్యాప్తు

అరకులోయ సీఐ దేముడుబాబు, ఎస్సై నజీర్‌ సిబ్బందితో సంజీవ్‌ ఇంటిని పరిశీలించారు. ఇంట్లో బిర్యానీ, మద్యం, రెండు కూల్‌డ్రింకు సీసాలు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వేలిముద్రలు సేకరించారు. స్థానికుల నుంచి వివరాలు నమోదు చేశారు. ముగ్గురు పిల్లలు, తల్లి మృతి వెనుక హత్య కోణం ఉందా లేక సురేఖ పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడిందా అన్న దానిపై దృష్టిసారించారు. శనివారం వేకువజాము వరకు పోలీసులు సంజీవ్‌ ఇంటి వద్దే ఉన్నారు. ఇటు సంజీవ్‌ బంధువులు, అటు సురేఖ బంధువులు ప్రాంతీయ ఆసుపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సురేఖ బంధువులు సంజీవ్‌తో వాగ్వాదానికి దిగారు. శనివారం మధ్యాహ్నం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

ఈ క్రమంలో వైకాపా నాయకుడు రఘునాథ్‌ నడుపుతున్న కారు అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. బ్రేక్‌ వేయడానికి బదులు ఎక్సలేటర్‌ తొక్కడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డుంబ్రిగుడ మండలం సర్రాయి గ్రామానికి చెందిన ఇద్దరు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని