నైజీరియన్ల నయా దందా: మాటలు కలుపుతూ.. కోట్లు కొట్టేస్తారు!

తాజా వార్తలు

Updated : 08/08/2021 08:37 IST

నైజీరియన్ల నయా దందా: మాటలు కలుపుతూ.. కోట్లు కొట్టేస్తారు!

  వైద్యులు, విశ్రాంత అధికారులు, వ్యాపారులకు గాలం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాను తగ్గించే నూనె, ఆయుర్వేద మూలికలు, పురుషుల్లో సంతాన సాఫల్యాన్ని పెంచే విత్తనాలు.. నైజీరియన్ల తాజా మోసాలకు ఆయుధాలివి. అమెరికా, ఇంగ్లండ్‌లలో ఉంటున్న భారతీయ వైద్యనిపుణులు, మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఆయుర్వేద వైద్యులు, వ్యాపారులను ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంటున్నారు. వారికి ఆసక్తి ఉన్న అంశాలను అధ్యయనం చేసి మరీ మోసాలకు తెరతీస్తున్నారు. హైదరాబాద్‌ వైద్యుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ నుంచి రూ.11.80 కోట్లు బదిలీ చేయించుకున్న నైజీరియన్లే.. పుణె, బెంగళూరు, దిల్లీల్లోనూ నేరాలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల్లో సుమారు రూ.22 కోట్లు కొల్లగొట్టారని ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

అందమైన యువతుల ఫొటోలతో నైజీరియన్లు ఫేస్‌బుక్‌ ఖాతాలను ప్రారంభించి.. స్నేహపూర్వక అభ్యర్థనను పంపుతున్నారు. అవతలివారు అంగీకరించగానే.. తాము విదేశాల్లో బహుళజాతి సంస్థల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నామని పరిచయం చేసుకుంటున్నారు. లండన్‌, అమెరికాల నుంచి మాట్లాడుతున్నామంటూ వర్చువల్‌ నంబర్లతో వాట్సప్‌ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నారు.

మోసగించారిలా..
 దిల్లీలో నివసించే మాజీ బ్రిగేడియర్‌(67)ను జాస్మిన్‌ విల్సన్‌ పేరుతో ఓ నైజీరియన్‌ యువతి రెండు నెలల క్రితం పరిచయం చేసుకుంది. లండన్‌లో తాము సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, పురుషుల్లో సంతానలేమిని తగ్గించే విత్తనాలను అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి కొంటున్నామని చెప్పింది. వారు ఒక ప్యాకెట్‌ రూ.7 వేలకు ఇస్తున్నారని, మీ నుంచి రూ.21 వేలకు కొంటామని నమ్మించింది. నెల రోజుల్లో రూ.1.09 కోట్లు బదిలీ చేయించుకొంది.

  మధ్యప్రదేశ్‌ అడవుల్లో లభించే ఆయుర్వేద మూలికలను కిలో రూ.50 లక్షలకు కొంటామని, 10 కిలోల మూలికలు కావాలంటూ పుణెకు చెందిన ఓ ఆయుర్వేద వైద్యురాలు(72)కి ఇద్దరు నైజీరియన్లు ఆరు నెలల క్రితం చెప్పారు. రెండు నెలల్లో రూ.4.90 కోట్లు కొల్లగొట్టారు.

బెంగళూరులోని విశ్రాంత అధికారిని జనవరిలో ముగ్గురు నైజీరియన్లు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్నారు. వింధ్య పర్వతాల్లో లభించే ప్రత్యేకమైన నూనె కరోనా వైరస్‌ను నియంత్రిస్తోందని, బ్రిటన్‌లోని 2ప్రముఖ ఫార్మా కంపెనీలు దాన్ని కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. లీటర్‌ నూనెను రూ.40 లక్షలకు కొంటున్నారని, మీకు రూ.55 లక్షలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. మూడు నెలల్లో ఆయన్నుంచి రూ.3.95 కోట్లు బదిలీ చేయించుకుని మోసగించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని