స్టేషన్లో పోలీసుల కొట్లాట: బాధ్యత మరిచి ప్రవర్తించిన ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌

తాజా వార్తలు

Updated : 13/08/2021 06:51 IST

స్టేషన్లో పోలీసుల కొట్లాట: బాధ్యత మరిచి ప్రవర్తించిన ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌

ఇద్దరినీ వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

పిఠాపురం, న్యూస్‌టుడే: బాధ్యతగా వ్యవహరించాల్సిన ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ స్టేషన్లో ఎస్సై ఉండగానే బూతులు తిట్టుకుని కొట్లాటకు దిగారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం గ్రామీణ పోలీసు స్టేషన్లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రైటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ జనార్దనరావును ఒక కేసు వివరాలు పెన్‌డ్రైవ్‌లో లోడ్‌ చేసి, ప్రింట్‌ తీసి ఇవ్వాలని ఏఎస్సై తిరుమలరావు ఆదేశించారు. పెన్‌డ్రైవ్‌లో వైరస్‌ ఉందని, సమాచారం లోడ్‌ చేసి ప్రింట్‌ తీయడం ఆలస్యమవుతుందని జనార్దనరావు సమాధానం ఇచ్చారు. దీనిపై ఇద్దరు వాదులాడుకున్నారు. ఎస్సై వేరే గదిలో ఉండగా.. ఇద్దరూ కొట్లాటకు దిగారు. దీంతో ఏఎస్సైకి చెవిపైన, హెడ్‌ కానిస్టేబుల్‌కు ఛాతీపైన స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై జగన్మోహనరావు ఈ విషయాన్ని సీఐ శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇద్దరిపైనా కేసు నమోదు చేసి ఎస్పీకి రిపోర్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ఇద్దరిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని