TS News: దశదిన కర్మకు వెళ్లి ముగ్గురి మృతి.. విష ప్రయోగమని అనుమానం

తాజా వార్తలు

Updated : 15/08/2021 09:27 IST

TS News: దశదిన కర్మకు వెళ్లి ముగ్గురి మృతి.. విష ప్రయోగమని అనుమానం

ఈటీవీ ఖమ్మం: దశదిన కర్మ సందర్భంగా భోజనాలకు వెళ్లిన ఆరుగురిలో ముగ్గురు అసువులు బాశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చంద్రుతండాకు చెందిన బోడ భిక్షం కుమారుడు అర్జున్‌ పది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు శనివారం ఆయన దశదినకర్మ నిర్వహించారు. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. సమీప బంధువులైన బోడ హరిదాసు (60), మల్సూరు (57), భద్రు (30), మరో ముగ్గురు బంధువులు వ్యవసాయ పనులకు వెళ్లటం వల్ల మధ్యాహ్నం భోజనాలకు హాజరుకాలేదు. సాయంత్రం వెళ్లారు. వీరికి భోజనంతోపాటు రెండు సీసాల్లో మద్యం ఏర్పాటు చేశారు. ఒక సీసాలోని మద్యం తాగిన ముగ్గురు కళ్లు తిరుగుతున్నాయని చెప్పి పడిపోయారు. ఖమ్మానికి తీసుకెళ్తుండగా బోడ హరిదాసు, భద్రు మార్గమధ్యంలో ప్రాణాలొదిలారు. మల్సూరు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భోజనం కోసం మొత్తం ఆరుగురు వెళ్లగా మొదటి సీసాలోని మందు తాగిన ముగ్గురు మృత్యుఒడికి చేరారు. రెండో  సీసాలోని మద్యం తాగిన వారి పరిస్థితి సాధారణంగా ఉంది.

దశదినకర్మ నిర్వాహకులకు, చనిపోయినవారి కుటుంబాల మధ్య గతంలో భూవివాదం ఉన్నట్లు బాధితుల బంధువులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. కూసుమంచి సీఐ సతీశ్‌ ఆస్పత్రిలో బాధితుల కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు. అయితే.. మద్యంలో విషప్రయోగం జరిగిందా? లేక కలుషిత ఆహారం కారణమా? అనేది తేలాల్సి ఉంది. ఫుడ్‌పాయిజన్‌ అయితే.. వాంతులు, విరేచనాలు అవుతాయనీ... అకస్మాత్తుగా మృతిచెందే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. కాగా దశదినకర్మ నిర్వహించిన బోడ భిక్షం కుటుంబీకులు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. రెండో సీసాలోని మద్యం తాగిన నలుగురు ఎందుకైనా మంచిదని ఖమ్మం ఆసుపత్రిలో చేరారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని