US: తెలుగు శాస్త్రవేత్తను డిబార్‌ చేసిన అమెరికా

తాజా వార్తలు

Updated : 22/10/2021 09:16 IST

US: తెలుగు శాస్త్రవేత్తను డిబార్‌ చేసిన అమెరికా

నకిలీ పరిశోధనతో బురిడీ..

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ పరిశోధన ఫలితాలతో అమెరికా సంస్థను, ప్రఖ్యాత జర్నల్‌ని తప్పుదోవ పట్టించిన విషయం వెలుగుచూసింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలక విభాగం ఆర్థిక సాయంతో జన్యు సంబంధిత అంశాలపై చేపట్టిన ఈ పరిశోధనలో ఆ దేశంలోని ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలతో పాటు ఓయూలోని ఓ ఆచార్యురాలు భాగస్వామిగా ఉన్నారు. వీరి పరిశోధన పత్రం 2014లో ప్రఖ్యాత నేచర్‌ జర్నల్‌లోని సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది. ఫలితాలపై అనుమానంతో అమెరికా ఆఫీస్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇంటిగ్రిటీ (ఓఆర్‌ఐ) విచారణ చేపట్టగా అది నకిలీ పరిశోధనగా వెల్లడైంది. దీంతో ప్రధాన శాస్త్రవేత్తను అమెరికా ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా అయిదేళ్లపాటు డిబార్‌ చేశారు.

ఈ వ్యవహారంలో ఓయూ ఆచార్యురాలు సహ భాగస్వామిగా ఉన్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజిస్టర్‌, సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ నుంచి భారత సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి(డీఎస్‌టీ) నివేదిక అందింది. దీంతో విచారణ జరిపించాలని ఇటీవల ఓయూకు కేంద్రం లేఖ రాసింది. ప్రస్తుతం సదరు ఆచార్యురాలు ఓయూలో కీలక స్థానంలో ఉండటం విశేషం. ఈ విషయంపై ఆమెను వివరణ కోరగా.. పరిశోధన పత్రంలో సహరచయితగా ఉన్నట్లు చెప్పారు. తదుపరి ఎలాంటి వివరాలు కావాల్సినా ప్రధాన రచయితతో మాట్లాడాలని తెలిపారు. కేంద్రం నుంచి లేఖ వచ్చిందని, త్వరలోనే విచారణ చేపడతామని ఓయూ ఉపకులపతి డి.రవీందర్‌ చెప్పారు. సదరు పరిశోధన పత్రాన్ని వెబ్‌సైట్‌ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు నేచర్‌ జనరల్‌ ప్రకటించింది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని