
తాజా వార్తలు
మాస్కులు ధరించలేదని 258 మంది జైలుకు!
భోపాల్: కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిని అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. నివారణ చర్యలు పాటించే విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇండోర్ నగరంలో మాస్కులు ధరించని కారణంగా పోలీసులు 258 మందిని తాత్కాలిక జైలుకు పంపించారు.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. మాస్కులు ధరించని వారిపై ఇండోర్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్నేహలతాగంజ్ ప్రాంతంలోని ఓ అతిథి గృహాన్ని తాత్కాలిక జైలుగా మార్చి అందులో పెడుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిని గుర్తించి, సీఆర్పీసీ సెక్షన్ 151 కింద వారిని అదుపులోకి తీసుకుని తాత్కాలిక జైలుకు తరలిస్తున్నారు. జైలుకు తరలించిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొంత సమయానికి విడుదల చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ జైల్లో 15 మంది పోలీస్ సిబ్బందిని, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతి ప్రభావం మధ్యప్రదేశ్‌లోనూ భారీగానే కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 3,722 కేసులు నమోదు కాగా.. అందులో 805 కేసులు ఇండోర్ నగరంలోనే నమోదయ్యాయి. ‘జిల్లాలో కొవిడ్ పాజిటివిటీ రేటు 15శాతం ఉంది. నిత్యం కేసుల సంఖ్య పెరుగుతోంది’ అని ఇండోర్ కొవిడ్ నోడల్ అధికారి అమిత్ వెల్లడించారు.