ఫేస్‌బుక్‌లో పెళ్లి.. ఆన్‌లైన్‌లో హత్యకు పథకం

తాజా వార్తలు

Updated : 30/06/2021 10:37 IST

ఫేస్‌బుక్‌లో పెళ్లి.. ఆన్‌లైన్‌లో హత్యకు పథకం

మంచిర్యాల క్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆధారాలు దొరక్కుండా పకడ్బందీగా జంట హత్యలకు పాల్పడిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్నారు. ఈ నెల 18న పట్టణంలోని బృందావన్ కాలనీలో విజయలక్ష్మి, ఆమె కూతురు రవీనాను దారుణంగా హత్య చేశారు. ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్‌తో పాటు గుంటూరు జిల్లాకు చెందిన జుజ్జవరపు రోశయ్య అలియాస్ బిట్టు, కృష్ణా జిల్లాకు చెందిన దండం సుబ్బారావు అనే కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.

‘‘ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్‌.. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మంచిర్యాల జిల్లా కేంద్రం బృందావన్ కాలనీకి చెందిన రవీనాను 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వరకట్నం కోసం వేధించడంతో మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. అప్పటినుంచి తన భార్యను కాపురానికి రానివ్వకుండా అడ్డుకుంటుందని అరుణ్ కుమార్‌ తన అత్తపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమంలో గన్ కల్చర్ ప్రోగ్రామ్స్ ద్వారా సుపారీ కిల్లర్స్ విజయవాడ సైట్‌లో తన అత్త, భార్యను చంపాలని కోరాడు. రూ. 10 లక్షలు సుపారీ కావాలని గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన రోశయ్య, కృష్ణా జిల్లా పెద్దప్రోలుకు చెందిన వెంకట సుబ్బారావులను సైట్‌ నిర్వాహకులు పరిచయం చేశారు. అయితే.. తన వద్ద డబ్బులు లేవని అత్తగారింట్లో 20 తులాల బంగారం, రూ.4 లక్షలు ఎప్పుడూ ఉంటాయని వారిని నమ్మించాడు. హత్యకు ప్రణాళిక కోసం మంచిర్యాలకు పిలిపించాడు.

ఈనెల 18న ఉదయం నాలుగు గంటలకు అరుణ్‌ మరో ఇద్దరితో కలిసి అత్త విజయలక్ష్మి, భార్య రవీనాను తాడుతో ఉరి బిగించి చంపేశారు. పోలీసులకు అనుమానం రాకుండా ఒక యాప్ సాయంతో సంప్రదింపులు జరిపారు. టెక్నాలజీని వాడుకొని ఆధారాలు లేకుండా హత్య చేశారు. ఇదే సాంకేతికతను ఉపయోగించి నిందితులను పట్టుకున్నాం. హత్యకు సంబంధించి నిందితులు వాడిన సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నాం’’అని సీపీ వివరించారు. ఈ కేసును ఛేదించేందుకు కృషి చేసిన పోలీసులు, సిబ్బందిని సీపీ అభినందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని