
తాజా వార్తలు
దొంగను అతడి పోనీటెయిలే పట్టించింది!
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు నగరంలో వరుస చోరీలకు పాల్పడిన దొంగలను నగర పోలీసులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు. ఓ కానిస్టేబుల్ జ్ఞాపకశక్తి.. అప్రమత్తతే వారిని పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా బెంగళూరులో వరుస చోరీలు జరిగాయి. పలు ప్రాంతాల్లో మహిళల మెడలోంచి బంగారు నగలను దొంగలు లాక్కెళ్తున్నారు. దీంతో పోలీసుల ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులందరికీ చూపించారు. అయితే, సమావేశానికి హాజరైన ఓ కానిస్టేబుల్ సీసీటీవీ ఫుటేజ్‌లో పోనీ టెయిల్ వేసుకున్న దొంగను గుర్తుపట్టాడు. ఎలాగంటే.. సమావేశానికి వచ్చే కొన్ని గంటల ముందే ఆ దొంగను ఆ కానిస్టేబుల్ ఓ టీస్టాల్ వద్ద చూశాడు. ఇదే విషయాన్ని తోటి పోలీసులకు చెప్పడంతో వారంతా అప్రమత్తమై దొంగలు వెళ్లే మార్గాలను గమనించగా.. వారు విమానాశ్రయం వద్దకు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 10లక్షలు విలువ చేసే ఆరు బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. సమయానికి తాము దొంగలను పట్టుకొని ఉండకపోతే వారు దిల్లీకి పారిపోయేవారని పోలీసులు వెల్లడించారు. దొంగను పోనిటెయిల్ చూసి గుర్తుపట్టిన కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.