కారు డ్రైవర్‌ను రోడ్డుపైనే చితక్కొట్టిన పోలీసులు

తాజా వార్తలు

Updated : 24/03/2021 13:04 IST

కారు డ్రైవర్‌ను రోడ్డుపైనే చితక్కొట్టిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌
కానిస్టేబుల్‌, హోంగార్డును సస్పెండ్‌ చేసిన ఎస్పీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. తరచూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు తరచూ చెప్పే మాటలివి. ఎక్కడ ఏం జరిగినా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించవచ్చు.. సమస్య ఏదైనా ఎలాంటి ఆలోచన, బెరుకు లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని చెబుతుంటారు. అయితే అచరణలో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది పూర్తిగా జరుగుతుందా? పోలీసులు నిజంగానే సామాన్య ప్రజలతో అంత ఫ్రెండ్లీగా ఉంటున్నారా? అంటే.. చెప్పలేని పరిస్థితి. తాజాగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ డ్రైవర్ పట్ల కొంత మంది పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసులుగా పేరున్న శాఖకు కొంతమంది తీరు తలవంపులు తెస్తోంది. సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ఓ డ్రైవర్‌పై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై బూటు కాలితో తన్నడంతో పాటు లాఠీలతో విచక్షణ లేకుండా చితకబాదారు.

సంగారెడ్డిలోని సదాశివపేటలో పోలీసులు సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కారు డ్రైవర్‌ వాజిద్‌ను ఆపి తనిఖీ చేసి వెళ్లిపోమని చెప్పారు. అంతలోనే పోలీసులు మరోసారి అనుమానం వచ్చి కారును ఆపాలని కోరారు. ఈ గందరగోళంలో డ్రైవర్‌కు విషయం అర్థం కాకపోవడం వల్ల వాహనాన్ని ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. అది గమనించిన పోలీసులు ఆగకుండా వెళ్తావా? అంటూ డ్రైవర్‌ను కారు నుంచి బయటకు లాగిపడేసి కొట్టారు. విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. కింద పడేసి ఓ కానిస్టేబుల్‌ కాలితో తన్నుతుండగా హోంగార్డు లాఠీతో చితక్కొడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ వాజిద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది పెడచెవిన పెడుతున్నారనే దానికి ఈ ఘటన నిదర్శనమని.. సదాశివపేట పోలీసుల తీరుపై ప్రజలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.

సమర్థించుకునే ప్రయత్నం చేసిన డీఎస్పీ..

డ్రైవర్‌ వాజిద్‌పై దాడి ఘటనను డీఎస్పీ బాలాజీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తనిఖీలు నిర్వహిస్తుండగా వాజిద్‌ వాహనం ఆపామని.. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు వాహనాన్ని తగిలించాడని డీఎస్పీ చెప్పారు. పోలీసులకు వాహనం తగలడంతో స్థానికులే కొట్టారని చెప్పుకొచ్చారు. డ్రైవర్‌, కానిస్టేబుళ్ల మధ్య తోపులాట జరిగిందన్నారు. నిన్న జరిగిన ఘటనను వెంటనే పరిష్కరించామని వెల్లడించారు. అయితే పోలీసులు డ్రైవర్‌ను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వైరల్‌ అవుతుండగా డీఎస్పీ ఘటనను సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. 

కానిస్టేబుల్‌, హోంగార్డు సస్పెన్షన్‌

డ్రైవర్‌ను చితకబాదిన ఘటనపై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. విచక్షణారహితంగా ప్రవర్తించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు. కానిస్టేబుల్‌ రాములు, హోంగార్డు బాలరాజును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై దుర్గయ్య, మరో కానిస్టేబుల్‌ ప్రసాద్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని