
తాజా వార్తలు
20ఏళ్ల తర్వాత..గ్యాంగ్‌రేప్ నిందితుడి అరెస్ట్!
ముఖ్యమంత్రిని గద్దెదించిన సంచలన కేసు
భువనేశ్వర్: రెండు దశాబ్దాల క్రితం ఒడిశాలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఐఎఫ్ఎస్ అధికారి మాజీ భార్య అత్యాచారానికి గురైన కేసులో ప్రధాన నిందితుడిని మహారాష్ట్రలో అరెస్టు చేశారు. 1999లో జరిగిన ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి రాజీనామాకు కారణమయ్యింది.
ఒడిశాలో 1999లో ఐఎఫ్ఎస్ అధికారి మాజీ భార్య భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తుండగా ముగ్గురు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం గ్యాంగ్‌రేప్ చేసి పరారయ్యారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమయ్యింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఈ కేసును ఒడిశా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
దర్యాప్తు జరిపిన సీబీఐ ఈ కేసులో ముగ్గురు నిందితులేనని తేల్చింది. వీరిలో ఇప్పటికే ఇద్దరికి శిక్ష పడగా ఒకరు ఈమధ్యే మరణించాడు. కానీ, ప్రధాన నిందితుడిగా ఉన్న బిబేకానంద బిశ్వాల్ మాత్రం రెండు దశాబ్దాలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. మారు పేరు, ఐడీతో మహారాష్ట్రలోని లోనావాలో ఉన్నట్లు ఒడిశా పోలీసులు గుర్తించారు. దీంతో ‘ఆపరేషన్ సైలెంట్ వైపెర్’ పేరుతో మూడు నెలల క్రితం ఆపరేషన్ చేపట్టిన ఒడిశా పోలీసులు, చివరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేసినందున నిందితున్ని వారికి అప్పగిస్తామని భువనేశ్వర్-కటక్ పోలీస్ కమిషనర్ సారంగి వెల్లడించారు.