అనుమానంతో హత్య..కొవిడ్‌ మృతిగా చిత్రీకరణ

తాజా వార్తలు

Updated : 03/07/2021 17:40 IST

అనుమానంతో హత్య..కొవిడ్‌ మృతిగా చిత్రీకరణ

హైదరాబాద్‌: కరోనా పరిస్థితిని కొంత మంది కిరాతకులు సానుకూలంగా మలుచుకుంటున్నారు. హత్య చేసి కరోనా ముసుగుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతి ఘటన మరువక ముందే హైదరాబాద్‌ వనస్థలిపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో భార్యను హత్య చేసి కొవిడ్‌ మృతిగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు అరెస్టు  చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిజానిజాలు వెలికి తీశారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు వెల్లడించారు.

‘‘నల్గొండ జిల్లా పీఏ పల్లికి చెందిన విజయ్‌కు మిర్యాలగూడ మండలం సీత్యా తండాకు చెందిన కవితతో వివాహం జరిగింది. వనస్థలిపురం వైదేహీనగర్‌లో నివాసముంటున్న విజయ్‌ ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు. భార్య ఎక్కువగా చరవాణిలో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న విజయ్‌.. ఆమెను ఎలాగైనా హతమార్చాలని కుట్రపన్నాడు. గతనెల 18వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో నింద్రిస్తున్న భార్య ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తర్వాత కవిత కరోనాతో చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వనస్థలిపురం నుంచి ఆటో రిక్షాలో కవిత మృతదేహాన్ని స్వగ్రామం నల్గొండ జిల్లా  పీఏ పల్లి తీసుకెళ్లాడు. కొవిడ్‌తో ఆమె చనిపోయిందని, ఎవరూ దగ్గరకు రావొద్దని చెప్పి అందరినీ దూరంగా ఉంచే ప్రయత్నం చేశాడు. విజయ్‌ ప్రవర్తనను అనుమానించిన అత్త .. తమ కుమార్తె కొవిడ్‌తో చనిపోలేదని, ఇతర కారణాలు ఉన్నాయని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె కొవిడ్‌తో చనిపోలేదని, ఊపిరాడకుండా చేయడం వల్ల చనిపోయిందని నివేదికలో తేలింది. దీంతో భర్త విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన భార్య ఇతరులతో తరచూ ఫోన్‌లో మాట్లాడేదని, అందుకే అనుమానంతో హత్య చేసినట్టు  పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో విజయ్‌ను ఇవాళ అరెస్టు చేశామని రాచకొండ సీపీ వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని