విమానంలో వచ్చి బైక్​ల చోరీ.. ఓఎల్​ఎక్స్​లో దందా!

తాజా వార్తలు

Published : 31/07/2021 15:49 IST

విమానంలో వచ్చి బైక్​ల చోరీ.. ఓఎల్​ఎక్స్​లో దందా!

బెంగళూరు: బైకుల హ్యాండిళ్లు విరగొట్టి.. అతి సులువుగా దొంగతనం చేసేస్తారు. చోరీ చేసిన ద్విచక్రవాహనాలకు ఏకంగా పోలీస్ నేమ్​ప్లేట్ తగిలించి వేరే చోటుకు తరలిస్తారు. ఓఎల్ఎక్స్​లో కస్టమర్లు అప్​లోడ్ చేసే బైకుల ధ్రువపత్రాల ఆధారంగా నకిలీ పత్రాలు సృష్టించి బైక్​ను తక్కువ ధరకు విక్రయిస్తారు. రాజస్థాన్​కు చెందిన కొందరు యువకులు బెంగళూరులో చేస్తున్న దందా ఇది. చోరీల కోసం వారు విమానాల్లో ప్రయాణం చేయడం గమనార్హం.

రాజస్థాన్​కు చెందిన వికాస్ కుమార్, ధవల్ దాస్, దశరథ్​లు బెంగళూరులోని ఓ మెకానిక్ షాప్​లో పనిచేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి అనేక ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. తక్కువ ధరకు ఒక్కొక్కటిగా విక్రయించేస్తారు. వచ్చిన డబ్బుతో రాజస్థాన్​కు వెళ్లి అక్కడ విలాసవంత జీవితం గడుపుతారు. డబ్బులు అయిపోగానే మళ్లీ బెంగళూరుకు వచ్చి తమ చోరకళను ప్రదర్శిస్తారు. రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వీరంతా విమానాలలో వచ్చి వెళ్తారంటే.. వీరి భోగాలు అర్థం చేసుకోవచ్చు.

చోరీ చేసిన ద్విచక్రవాహనాలకు పత్రాలు తయారు చేసేందుకు ఓఎల్​ఎక్స్​ను ఉపయోగించుకున్నారు ఈ నిందితులు. ఇతర కస్టమర్లు అప్​లోడ్ చేసిన బండి కాగితాల ఆధారంగా ఫోర్జరీకి పాల్పడేవారు. నకిలీ ఆర్​సీ బుక్​లు తయారు చేసి.. చోరీ చేసిన బైక్​లను ఓఎల్​ఎక్స్​లోనే విక్రయించేవారని పోలీసులు తెలిపారు. సులభంగా రవాణా చేసేందుకు వాటికి పోలీస్ నేమ్​ప్లేట్​ను తగిలించేవారు. లాక్​డౌన్ సమయంలో ఎవరూ ఆపకుండా ఉండేందుకు ఇలా చేశారని పోలీసులు తెలిపారు. చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా బెంగళూరు పోలీసులు ఈ నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 26 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని