గోదావరి స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి

తాజా వార్తలు

Updated : 02/04/2021 15:53 IST

గోదావరి స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి

పోచంపాడు‌: నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోచంపాడు వీఐపీ పుష్కరఘాట్‌ వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు మృతిచెందారు. తొలుత ఐదుగురు నదిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు. వారిని కాపాడేందుకు మరో ఇద్దరు వెళ్లి వారు కూడా గల్లంతయ్యారు. వీరిలో ఆరు మృతదేహాలను బయటకు తీయగా.. గల్లంతైన మరో చిన్నారిని స్థానికులు కాపాడారు. మృతులంతా దగ్గరి బంధువులే కావడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఈరోజు ఉదయం ఎల్లమ్మగుట్ట, డీకంపల్లి, మాక్లుర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలకు చెందిన మూడు కుటుంబాలవారు గోదావరిలో స్నానానికి వెళ్లారు. ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నదిలోకి జారిపోయారు. వారిని కాపాడేందుకు మరో ఐదుగురు నదిలోకి దిగారు. ఇందులో ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. స్థానికులు ఒక బాలుడిని సురక్షితంగా కాపాడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఆరు మృతదేహాలను వెలికితీశారు. మృతులు నిజామాబాద్‌ ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్‌ (40), అతని కుమారులు శ్రీకర్‌(14), సిద్దార్థ్‌ (16), మక్లూర్‌ మండలం గుత్ప గ్రామానికి చెందిన రాజు (24), నందిపేట్‌ మండలం డీకంపల్లికి చెందిన యోగేష్‌ (16), సురేశ్ (42)‌గా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
గోదావరిలో ఆరుగురి మృతిపై సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్నానానికి వెళ్లి మృత్యువాత పడటం ఎంతో కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నదిలో స్నానానికి దిగి దురదృష్టవశాత్తూ ఆరుగురు మృతిచెందడం ఎంతో బాధించిందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని