అక్షరం వాసిలో తప్పించుకుబోయాడు!

తాజా వార్తలు

Published : 18/07/2021 01:32 IST

అక్షరం వాసిలో తప్పించుకుబోయాడు!

చెన్నై: ఒక్క అక్షరంలో దొర్లిన దోషం కారణంగా ఓ నేరగాడు తప్పించుకోబోయాడు. ఎఫ్‌ఐఆర్‌ టైపింగ్‌లో దొర్లిన పొరపాటును ఆసరాగా చేసుకుని అత్యాచార నేరం నుంచి నిర్దోషిగా బయటపడబోయాడు. హైకోర్టు జోక్యం చేసుకుని దిగువస్థాయి కోర్టు తీర్పును తిరగదోడడంతో దోషిగా తేలాడు. జైలుకు వెళ్లాడు. ఒక్క అక్షరం కూడా ఎంత ముఖ్యమో తెలియజెప్పే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువూరు జిల్లాకు చెందిన ప్రకాశ్‌ అనే వ్యక్తి 2017 సెప్టెంబర్‌లో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పని మీద బయటకు వెళ్లిన తల్లి ఇంటికొచ్చి చూసేసరికి చిన్నారి ఏడుస్తూ కనిపించింది.  వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఎఫ్‌ఐఆర్‌లో semen (వీర్యం) బదులు.. Semman (తమిళంలో ఎర్రటి ఇసుక) అని పోలీసులు పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దిగువ న్యాయస్థానంలో డిఫెన్స్‌ లాయర్‌ వాదనలు వినిపించడంతో నిందితుడు నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు.. దిగువ స్థాయి న్యాయస్థానం తీర్పును కొట్టివేసింది. ప్రకాశ్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాలిక కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారుల తీరును తప్పుబట్టింది. ఇలాంటి కేసుల్లో ఏమాత్రం అవకాశం దొరికినా దోషులు తప్పించుకు పారిపోతారని, అప్రమత్తత అవసరం అని హెచ్చరించింది. దిగువస్థాయి న్యాయస్థానం వైఖరిని సైతం తప్పుబట్టింది. ప్రతిసారీ ఆధారాలే కాదు.. విచక్షణాధికారాలు ఉపయోగించాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేలుమురగన్‌ అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని