Cyber Crime: ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో మీరు రూ.25 లక్షలు గెలిచారు..

తాజా వార్తలు

Updated : 25/07/2021 06:51 IST

Cyber Crime: ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో మీరు రూ.25 లక్షలు గెలిచారు..

యువతికి సైబర్‌ వల.. రూ.8 లక్షలు స్వాహా

జీడిమెట్ల, న్యూస్‌టుడే: తల్లి క్యాన్సర్‌తో పోరాడుతోంది. వైద్యం చేయించాలన్నది కుమార్తె కోరిక. ఈలోగా ఓ ఫోన్‌ వచ్చింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో మీరు విజేతగా నిలిచారు. రూ.25 లక్షలు గెలుచుకున్నారని చెప్పడంతో తల్లికి వైద్యం చేయిద్దామనుకుంది. వల విసిరింది సైబర్‌ నేరగాళ్లని తెలుసుకోలేక రూ.8 లక్షలు కోల్పోయింది. జీడిమెట్ల ఠాణా పరిధి చింతల్‌కు చెందిన మహిళకు ఈనెల 9న ఓ ఫోన్‌ వచ్చింది. విజయ్‌కుమార్‌ను మాట్లాడుతున్నానని, ‘కౌన్‌ బనే గా కరోడ్‌పతి’లో రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారని చెప్పాడు. ఖాతా నంబరు చెప్పమన్నాడు. స్నేహితుల ఖాతా నంబరు ఇచ్చింది. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 లక్షలు చెల్లించాలనడంతో మీ సేవా కేంద్రం నుంచి వారు చెప్పిన ఖాతాకు పంపింది. 15న మరో వ్యక్తి వాట్సాప్‌కాల్‌ చేసి.. తాను సునీల్‌మెహతా అని, కౌన్‌ బనేగా కరోడ్‌పతికి విచారణ అధికారిని అన్నాడు. కరెన్సీ మార్పు కోసం రూ.75 వేలు చెల్లించాలని చెప్పడంతో చెల్లించింది. 16న మకొకరు ఫోను చేసి.. రూ.25 వేలు చెల్లించాలనడంతో పంపించింది. 17న సునీల్‌ మెహతా మళ్లీ ఫోన్‌ చేసి.. ప్రైజ్‌ మనీ పంపించాం. ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఆపేశారు. సెటిల్‌మెంట్‌ చేసుకోమని చెప్పాడు. రెండు బ్యాంకు ఖాతాలను పంపించి.. రూ.1.25 లక్షలు చెల్లించాలని సూచించడంతో ఆ మొత్తం పంపించింది. ఇలా వివిధ కారణాలు చెబుతూ 18న రూ.1.30 లక్షలు, 21న మరికొంత నగదు రాబట్టుకొన్నారు. 13 రోజుల పాటు సాగిన సంభాషణలో బాధితురాలు విడతల వారీగా రూ.8,18,000 చెల్లించింది. మళ్లీ ఫోను చేసి నగదు కావాలని అడుగుతుండటంతో మోసపోయినట్లు గ్రహించి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని