
తాజా వార్తలు
పోలీసు కస్టడీకి అఖిలప్రియ సహాయకులు
హైదరాబాద్: ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసు కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌లను ఇవాళ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి మూడురోజుల కస్టడీకి తీసుకున్నారు. అపహరణలో నిందితులిద్దరూ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. కస్టడీకి తీసుకున్న ఇద్దరు నిందితులతో రేపు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డు చేయనున్నారు.
ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయస్థానం ఆమెకు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీ చదవండి..
బైడెన్ ప్రమాణస్వీకారం.. ఆసక్తికర విషయాలు