close

తాజా వార్తలు

Published : 18/01/2020 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భర్తే హంతకుడు..!

వీడిన వివాహిత మృతి మిస్టరీ

ఏలూరు నేరవార్తలు : తన భార్య స్నానాల గదిలో పడి గాయాలపాలై మృతి చెందిందని ఆమె భర్త 21 నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి ఈ కేసు పురోగతి సాధించలేదు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ నవదీప్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ పర్యవేక్షణలో స్థానిక గ్రామీణ సీఐ అనసూరి శ్రీనివాసరావు ఈ కేసుపై ప్రధానంగా దృష్టి పెట్టారు. దర్యాప్తును వేగవంతం చేసి కేసును ఛేదించారు. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి ఆ వివాహితను హత్య చేసినట్లు కనుగొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. స్థానిక గ్రామీణ పోలీసుస్టేషన్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ వివరాలు వెల్లడించారు.

కృష్ణా జిల్లా పెనుమాకలంక గ్రామానికి చెందిన మోరు రామకృష్ణ కుమార్తె చంటి (25)కి, పెదపాడు మండలం వడ్డిగూడేనికి చెందిన ఘంటసాల ఉదయ్‌ కుమార్‌ రాజుతో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. చేపల చెరువులు నిర్వహిస్తూ ఉదయ్‌కుమార్‌ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న చంటి.. భర్త కార్యకలాపాలకు అడ్డు చెబుతుండేది. ఈ నేపథ్యంలో భార్య అడ్డు తొలగించుకోవాలని ఉదయ్‌కుమార్‌ ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. అనుకున్న విధంగానే 2018 మార్చి 30న రాత్రి 12 గంటలకు ఇంట్లో పిల్లలు నిద్రపోతున్న సమయంలో తన భార్య చంటి తలపై రాడ్డుతో బలంగా మోదడంతో ఆమె వెంటనే చనిపోయింది.

సాక్ష్యాలు తారుమారు : భార్యను హత్య చేసిన ఉదయ్‌కుమార్‌ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించాడు. తొలుత చీరతో ఫ్యానుకు ఉరివేశాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. భార్య చెవుల నుంచి రక్తం కారడంతో ఉరి వేసుకుని మృతి చెందిందంటే ఎవరూ నమ్మరని దానిని విరమించుకున్నాడు. ఆ తర్వాత సాన్నాల గదిలో కాలుజారి పడిపోయిందని.. తలకు తీవ్రగాయమై చనిపోయిందని అందరికీ చెప్పాడు. పోలీసులు  భర్త వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిగా కేసు నమోదు చేశారు. తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని చంటి తండ్రి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీఐ శ్రీనివాసరావు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. భర్త ప్రవర్తనపై నిఘా పెట్టడంతో అతనికి వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నారు. చంటిది హత్యేనని నిర్ధరణకు వచ్చి హత్య కేసుగా మార్చి భర్తను పూర్తిస్థాయిలో విచారించారు. భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఉదయ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.