close

ప్రధానాంశాలు

Published : 17/09/2020 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంజర్‌భట్‌ల పంజాలే అవి!

జాతీయ రహదారులపై వరుస దోపిడీలు
మొన్న నగరి-పుత్తూరు మధ్య, తాజాగా మంగళగిరి సమీపంలో
ఏపీలో మరోసారి రెచ్చిపోతున్న మధ్యప్రదేశ్‌ ముఠా?

ఈనాడు, అమరావతి: విలువైన వస్తువుల లోడుతో జాతీయ రహదారులపై వెళ్లే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెగబడే కంజర్‌భట్‌ ముఠా మరో మారు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిందా..? ఇటీవల చిత్తూరు జిల్లా నగరి-పుత్తూరు మధ్య, తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారులపై జరిగిన దోపిడీ ఘటనలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. గతంలో ఈ ముఠా నేరాలకు పాల్పడిన తీరు, తాజా ఘటనలు జరిగిన క్రమాన్ని విశ్లేషిస్తే ఇది వారి పనేనని స్పష్టమవుతోంది. గతేడాది ప్రారంభంలో రాష్ట్రంలో వరుసగా దోపిడీలకు తెగబడి భయోత్పాతం సృష్టించిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా సభ్యులు మరో మారు రాష్ట్రంలో తమ పంజా విసురుతున్నట్లు పరిణామాలను బట్టి తెలుస్తోంది.

ఖరీదైన కార్లలో బయల్దేరి... లారీలను వెంటాడి
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ ప్రాంతానికి చెందిన కంజర్‌భట్‌లు ముఠాలుగా విడిపోయి దోపిడీలకు పాల్పడుతుంటారు. ఒక్కో ముఠాలో కనీసం 20-25 మంది సభ్యులు ఉంటారు. దోపిడీల కోసం బయల్దేరినప్పుడు అత్యంత ఖరీదైన కార్లలో ప్రయాణం సాగిస్తుంటారు. తమ వెంట రెండు, మూడు లారీలను సైతం తీసుకొస్తారు. జాతీయ రహదారులపై సెల్‌ఫోన్లు వంటి ఖరీదైన వస్తువులతో వెళ్తున్న లారీలు, కంటైనర్లను గమనిస్తారు. జనసంచారం లేని, చీకటిగా ఉండే ప్రదేశాల్లో వాటిని అడ్డగించి..సరకును తమ వెంట తీసుకొచ్చిన లారీల్లోకి మార్చేస్తారు. తర్వాత వాటిని సరిహద్దులు దాటించేస్తారు.

తిరగబడితే హతమారుస్తారు..
దోపిడీకి పాల్పడే సమయంలో లారీ డ్రైవర్లు ఎవరైనా తిరగబడితే వారిపై తీవ్రంగా దాడి చేసి, కాళ్లు చేతులు కట్టేసి బయట పడేస్తారు. పలు సందర్భాల్లో వారిని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి.
* 2018 చివర్లో అనంతపురం జిల్లా కనగానపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ లారీని అటకాయించి డ్రైవర్‌ను చంపేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా గంగవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ డ్రైవర్‌ను హతమార్చారు. 2019 ప్రారంభంలో తమిళనాడు-నెల్లూరు-చిత్తూరు సరిహద్దుల్లో పలువురు లారీ డ్రైవర్లపై దాడిచేసి దోపిడీలకు యత్నించారు. శ్రీసిటీ సెజ్‌ నుంచి కోల్‌కతాకు రెడ్‌మీ సెల్‌ఫోన్ల లోడుతో వెళ్తున్న లారీని అడ్డుకుని అందులోని సరుకు దోచుకున్నారు.

మాట కలిపి... వివరాలు తెలుసుకుని..
* ముఠాలోని సభ్యులు కొంతమంది కార్లలో తిరుగుతుంటారు. మరికొందరు తమ వెంట తీసుకొచ్చిన లారీలను నడిపించే బాధ్యతలు చూస్తుంటారు. ఇంకొందరు జాతీయ రహదారి పొడవునా ఉండే దాబాల్లో గడుపుతుంటారు. అక్కడకు వచ్చే లారీ, కంటైనర్ల డ్రైవర్లతో మాట కలుపుతారు. సరకు వివరాలు.. ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడకు వెళ్తోంది తదితర వివరాలు తెలుసుకుంటారు. అంతా అనుకూలం అనుకుంటే..ఆ సమాచారాన్ని ముఠాలోని ఇతర సభ్యులకు చెబుతారు. పక్కాగా రెక్కీ నిర్వహించాక అంతా కలిసి ఆ వాహనాల్ని అనుసరించి దోచుకుంటారు.
* ఒక విడతలో కనీసం రూ.5-6 కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టడం ఈ ముఠా అలవాటు. గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా రూ.80 కోట్ల విలువైన సరుకు దోచుకుని ఉంటారని పోలీసుల అంచనా.
* 20 రోజుల కిందట తమిళనాడులోని శ్రీపెరంబుదూరు నుంచి ముంబయికి ఒక ప్రముఖ సంస్థకు చెందిన సరకుతో వెళ్తున్న లారీని నగరి-పుత్తూరు మధ్య అడ్డగించి రూ.7 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు దోచుకున్నారు. మంగళగిరి సమీపంలో బుధవారం జరిగిన ఘటనలోనూ రూ.80 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి.

పట్టుకోవడం సవాలే
* నేరాలకు పాల్పడిన ప్రతిసారీ కొత్త ఫోన్లు, నూతన సిమ్‌కార్డులు ఉపయోగిస్తారు. బయట వారికి వాటితో కాల్‌ చేయరు.
* సిమ్‌కార్డులను స్వీయ గుర్తింపు కార్డులతో తీసుకోరు. స్మార్ట్‌ఫోన్లు వాడరు. దోపిడీ పూరయ్యాక ఉపయోగించిన ఫోన్లను నీటిలో పడేస్తారు.
* తమ లారీల నంబర్‌ ప్లేట్లను తరచూ మార్చేస్తారు.
* ముఠాలోని ఒకరో, ఇద్దరో తప్ప ముఠా సభ్యులందర్నీ పట్టుకోవటం ఇప్పటివరకూ సాధ్యపడలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.