close

ప్రధానాంశాలు

Published : 26/11/2020 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఐ లాకర్‌లో భారీ నగదు

రూ. 34.40 లక్షలు, 9 లక్షల విలువైన బంగారం లభ్యం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

అనిశా కేసులో అరెస్టై సస్పెన్షన్‌కు గురైన సీఐ జగదీశ్‌ లాకర్‌లో భారీగా నగదు, బంగారం దొరికింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకు లాకర్‌ను బుధవారం సీఐ కుటుంబ సభ్యుల సమక్షంలో అనిశా అధికారులు తెరవగా రూ.34,40,200 నగదు లభించింది. రూ.9,12,800 విలువ చేసే 182.560 గ్రాముల బంగారం, రూ. 1020 విలువ చేసే 15.7 గ్రాముల వెండి ఉంది. ఇతర ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు లభ్యమయ్యాయి. సోదాల సమయంలో సీఐ ఇంట్లో కేవలం రూ.60 మాత్రమే దొరకడం గమనార్హం. లాకర్‌లో భారీగా నగదు లభ్యం కావడంతో అనిశా అధికారులు నివ్వెరపోయారు. ఇప్పటి వరకు జిల్లాలో ఓ సీఐ స్థాయి అధికారి వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించడం ఇదే తొలిసారి. బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా లాకర్‌లో నిల్వ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 కీలక సమాచారంతో ముందుకు: అనిశా అధికారులకు కీలక సమాచారం లభించడంతో బెట్టింగ్‌ కేసు విచారణను వేగవంతం చేశారు. రెండ్రోజులుగా జిల్లాలో పలువురు పోలీసు అధికారుల నుంచి కేసుకు సంబంధించి వివరాలను రాబట్టారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.5 లక్షలు డిమాండు చేసి పట్టుబడిన సీఐ జగదీశ్‌, ప్రైవేటు వ్యక్తి సుజయ్‌ను అన్ని విధాలుగా ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో ఉన్న డీఎస్పీ లక్ష్మీనారాయణ నివాసంలో, కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. అక్కడ దొరికిన దస్త్రాల ఆధారంగా అనిశా అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. లాకర్‌లో దొరికిన డాక్యుమెంట్ల వివరాలు అనిశా అధికారులు వెల్లడించలేరు. సీఐ జగదీశ్‌ది వికారాబాద్‌ జిల్లా. అక్కడ భూములు ఉన్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన