close

ప్రధానాంశాలు

Updated : 14/01/2021 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రుణయాప్‌ల కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌

నిందితుల్లో ఒకరిది చైనా

నాగోలు, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ రుణయాప్‌ల కేసులో మరో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు ముంబయి థానేలో అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన చైనాకు చెందిన హి జియాన్‌(26), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌కుమార్‌(26)ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రూ.28 కోట్ల నిల్వలున్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అరెస్ట్‌ వివరాలను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ బుధవారం విలేకరులకు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. యాప్‌ల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ మానసికంగా వేధిస్తున్న జియా లియాంగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(కాల్‌ సెంటర్‌) డైరెక్టర్‌ పరశురాంలాహూ థాక్వే(32), అతని భార్య లియాంగ్‌ టియాన్‌ టియాన్‌(34, చైనా), హెచ్‌ఆర్‌ యాఖిబ్‌ షేక్‌ను గతనెల 27న రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 105 ల్యాప్‌ట్యాప్‌లు, 100 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అజయ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బియాన్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రై.లి., ఏపోచ్‌ గో క్రెడిట్‌ సొల్యూషన్స్‌ ప్రై.లి., త్రుతిగ్‌ ఫైన్‌టెక్‌ ప్రై.లి. తదితర రుణ యాప్‌ సంస్థలతో పరశురాం ఒప్పందం కుదుర్చుకుని కాల్‌సెంటర్‌ సేవల్ని అందిస్తున్నాడు. చైనాకు చెందిన క్సూ నాన్‌, క్సూ క్సిన్‌చాంగ్‌, జావో కియావో తెర వెనక ఉండి ఈ సంస్థలను నడిపిస్తున్నారు. వాళ్ల తరఫున చైనాకు చెందిన హి జియాన్‌ భారత్‌లో ఉంటూ.. ఆ కంపెనీలను పర్యవేక్షిస్తున్నట్లు తేలింది. హి జియాన్‌ 2019లో బిజినెస్‌ వీసాపై భారత్‌కు వచ్చి అంకుర్‌సింగ్‌ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు. 25 రుణ యాప్‌లను రూపొందించి, ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకోకుండానే అధిక శాతం వడ్డీలకు రుణాలిస్తున్నారు. వారం తర్వాత రుణాలను తిరిగి చెల్లించని వారి వివరాలను పరశురాంకు చెందిన కాల్‌సెంటర్‌కు అందజేస్తున్నారు. అక్కడి సిబ్బంది మానసికంగా వేధిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు హి జియాన్‌ అలియాస్‌ మార్క్‌, అకౌంటెంట్‌ వివేక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని, వారి దగ్గరి నుంచి 4 ల్యాప్‌ట్యాప్‌లు, ఓ చైనా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ  వివరించారు. అధిక శాతం రుణయాప్‌లకు చైనా నుంచే నిధులు వస్తున్నట్లు గుర్తించామన్నారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన