close

ప్రధానాంశాలు

Updated : 24/01/2021 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంగారం దొంగలు చిక్కారు

హోసూరులో దోపిడీ..   సైబరాబాద్‌లో అరెస్టు
కంటైనర్‌లో తరలిస్తున్న రూ.12.5 కోట్ల విలువైన ఆభరణాలు గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, రాయదుర్గం: తమిళనాడులోని హోసూరు ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో 25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకుని మహారాష్ట్రకు పారిపోతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కృష్ణగిరి జిల్లా ఎస్పీ గంగాధర్‌ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అధికారులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్‌ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్‌ సమీపంలో లారీ కంటైనర్‌లో తీసుకెళ్తున్న రూ.12.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.93 వేల నగదు, తుపాకులు, పిస్తోళ్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ముత్తూట్‌, మణప్పురం గోల్డ్‌ కంపెనీల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని జబల్‌పూర్‌కు చెందిన రూప్‌సింగ్‌ బాగల్‌, అమిత్‌, శంకర్‌సింగ్‌ బాగల్‌, ఝార్ఖండ్‌కు చెందిన పవన్‌ మండల్‌, వివేక్‌ మండల్‌, భూపేందర్‌లు కొన్నేళ్లుగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గత అక్టోబరులో పంజాబ్‌ రాష్ట్రం లూథియానాలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి యత్నించి విఫలమై తప్పించుకున్నారు. కొద్దిరోజుల తర్వాత రూప్‌సింగ్‌, అమిత్‌ బెంగళూరుకు వచ్చారు. హోసూరులో ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయం దోపిడీకి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. జనవరి 1న అమిత్‌ కార్యాలయానికి వెళ్లొచ్చాడు. చోరీ సొత్తును కంటైనర్‌లో తీసుకెళ్లాలని భావించారు. తుపాకులు, రివాల్వర్లు, తూటాలు నాగ్‌పుర్‌లో ఉంటున్న లుల్యాపాండే ఇస్తాడని, కంటైనర్‌ కూడా అక్కడే ఉంటున్న తన స్నేహితుడు కౌశల్‌కుమార్‌ సమకూరుస్తాడని అమిత్‌ చెప్పాడు. అమిత్‌, శంకర్‌సింగ్‌లు వారం కిందట నాగ్‌పుర్‌ వెళ్లి లుల్యా నుంచి ఆయుధాలు తీసుకున్నారు. కేరళకు బైక్‌ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను వాడుకోవాలని నిందితులు నిర్ణయించుకుని బెంగళూరుకు చేరారు.
15 రోజుల రెక్కీ.. 15 నిమిషాల్లో దోపిడీ
ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి రూప్‌సింగ్‌ ముఠా 15 రోజులు రెక్కీ నిర్వహించింది. ఈ నెల 18న రూప్‌సింగ్‌ బెంగళూరులో 3 ద్విచక్రవాహనాలను కొన్నాడు. ఆరుగురూ వాటిపై హోసూరుకు వెళ్లి ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయం చుట్టూ పరిశీలించేవారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అమిత్‌, పవన్‌, వివేక్‌లు ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి వెళ్లగా.. రూప్‌సింగ్‌, శంకర్‌, భూపేందర్‌లు బయట ఉన్నారు. తుపాకులు, పిస్తోళ్లతో కార్యాలయంలో సిబ్బందిని బెదిరించి 15 నిముషాల్లో 25 కేజీల బంగారు ఆభరణాలను 3 సంచుల్లో వేసుకుని బయటకు వచ్చారు. బైక్‌లపై రూప్‌సింగ్‌, శంకర్‌, భూపేందర్‌లు సిద్ధంగా ఉండటంతో బెంగళూరు సరిహద్దులకు చేరుకుని బైకులు వదిలేసి కంటైనర్‌లో వచ్చేశారు. అమిత్‌ మాత్రం కంటైనర్‌లో వచ్చాడు. వీరు ప్రయాణిస్తున్న సుమోను అనంతపురంలో వదిలేసి, మరో సుమోను అద్దెకు తీసుకున్నారు. తెలంగాణలోకి ప్రవేశించగానే సైబరాబాద్‌ పోలీసులు బంగారు ఆభరణాలు, నిందితులతో పాటు లారీ కంటైనర్‌, సుమోను అదుపులోకి తీసుకున్నారు.
670 కిలోమీటర్ల ఛేజింగ్‌
ఈ ఘరానా దొంగలను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులు హోసూరు నుంచి హైదరాబాద్‌ వరకు 15 గంటలపాటు వెంటాడారు. ముత్తూట్‌ ఉద్యోగులిచ్చిన సమాచారం, బైకులు వదిలేసిన స్థలం, సెల్‌ఫోన్‌ టవర్ల ద్వారా సమాచారం తెలియగానే.. కృష్ణగిరి ఎస్పీ.. నిజామాబాద్‌వాసి గంగాధర్‌ అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లకు ఫోన్‌లో విషయాన్ని వివరించారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి మూడు కమిషనరేట్లలోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
కర్ణాటక.. ఏపీ దాటేశారు
రూప్‌సింగ్‌ బృందం బెంగళూరులో ఓ సుమోను అద్దెకు తీసుకొని కంటైనర్‌ వెనుక వెళ్తున్నట్లు కృష్ణగిరి జిల్లా ఎస్పీ గంగాధర్‌ గుర్తించారు. అనంతపురంలో దీన్ని వదిలేసి.. మరో సుమోను అద్దెకు తీసుకుంది. ఈక్రమంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు టోల్‌ప్లాజాల సమీపంలో మఫ్టీలో నిఘా ఉంచారు. రాయ్‌కల్‌ టోల్‌ప్లాజా వద్ద టాటా సుమో అనుమానాస్పదంగా కనిపించిందని అక్కడి పోలీస్‌ అధికారి శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన అప్రమత్తమై జడ్చర్ల, షాద్‌నగర్‌లలో పెట్రోలింగ్‌ వాహనాలను సిద్ధంగా ఉంచారు. పోలీసులు రూప్‌సింగ్‌ బృందం వాహనాన్ని అనుసరించారు. శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లికి టాటా సుమో రాగానే డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి వాహనాన్ని ఆపారు. రూప్‌సింగ్‌, శంకర్‌సింగ్‌, పవన్‌కుమార్‌, భూపేందర్‌, వివేక్‌మండల్‌లను అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్‌ నాగ్‌పుర్‌ వెళ్తోందని, అక్కడి విమానాశ్రయానికి చేరుకున్నాక లుల్యాపాండేతో మాట్లాడి సొత్తును పంచుకోవాలని నిర్ణయించుకున్నామని నిందితులు తెలిపారని సీపీ వెల్లడించారు. మేడ్చల్‌ వద్ద పోలీసులు కంటైనర్‌ లారీ డ్రైవర్‌ టేక్‌రామ్‌, క్లీనర్‌ రాజీవ్‌కుమార్‌లను పట్టుకున్నట్టు చెప్పారు. లారీలో ఉన్న అమిత్‌ తప్పించుకుని పారిపోయాడన్నారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన