close

ప్రధానాంశాలు

Updated : 25/02/2021 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కిడ్నాప్‌ నాటకమాడిన బీ-ఫార్మసీ విద్యార్థిని విషాదాంతం

బీపీ, షుగర్‌ మాత్రలు మింగి ఆత్మహత్య!
పదకొండు రోజులు చీకట్లోనే.. దయ్యం పట్టిందంటూ పూజలు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఘట్‌కేసర్‌: తెలిసీతెలియనితనమో! అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనో! విపరీత ప్రవర్తనో! తల్లిదండ్రుల వద్ద సానుభూతి పొందాలనే ధోరణో! కారణమేదైనా ఆ యువతి తన అనాలోచిత చర్యతో కన్నవాళ్లకు తలవంపులు తేవడంతోపాటు సమాజంలో పలుచనైంది. ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి? అసలు దిద్దుకోగలనా? లేదా? ఇకపై సమాజం నన్ను ఎలా చూస్తుంది? ఇత్యాది ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. ఆవే ఆమెను పది రోజులపాటు చీకట్లో మగ్గేలా చేసి..చివరికి బలవన్మరణం వైపు తోసేశాయి. కిడ్నాప్‌ నాటకమాడి రాచకొండ పోలీసులను పరుగులు పెట్టించిన ఘట్‌కేసర్‌కు చెందిన బీ-ఫార్మసీ విద్యార్థిని జీవితం చివరికి విషాదంతమైంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి ఆర్‌ఎల్‌ఆర్‌నగర్‌కు చెందిన విశ్రాంతి ఉద్యోగి కుమార్తె (19) మేడ్చల్‌ సమీపంలోని ఓ కళాశాలలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుంది. ఈ నెల 10వతేదీ సాయంత్రం కిడ్నాప్‌ నాటకమాడింది. తనను ఆటో డ్రైవర్‌ అపహరించుకు వెళ్తున్నాడంటూ తల్లికి ఫోన్‌చేసి చెప్పగా, ఆమె బంధువుల సాయంతో డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. రాచకొండ పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అన్నోజిగూడ రైల్వేగేటు సమీపంలోని యువతిని గుర్తించారు. చిరిగిన బట్టలతో అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. తనను నలుగురు ఆటోడ్రైవర్లు అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో యువతి చెప్పడంతో ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అనేక కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు అసలు కిడ్నాప్‌ జరగలేదని, ఆమె నాటకం ఆడిందని తేల్చారు.

మానసికంగా కుంగిపోయిందా?
పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికెళ్లినప్పట్నుంచి యువతి ప్రవర్తనలో మార్పువచ్చినట్టు సమాచారం. ‘ఎవరితోనూ మాట్లాడటంలేదు. చీకట్లోనే ఉంటోంది. గది నుంచి బయటకు తీసుకొచ్చేందుకు యత్నించినా వెలుగుచూసి గజగజా వణికిపోయేది’ అని కుటుంబ సభ్యులు చెప్పడాన్ని బట్టి యువతి మానసికంగా ఎంతగా కుంగిపోయిందో చెప్పకనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో దయ్యం పట్టిందేమోననే అనుమానంతో బంధువులు ప్రత్యేక పూజలు చేయించినట్టు, మంత్రగాళ్ల దగ్గరకు తీసుకెళ్లినట్టు సమాచారం.

మూర్ఛ లక్షణాలతో ఆసుపత్రికి
మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో కుమార్తె కిందపడి కాళ్లు, చేతులు కొట్టుకోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మానసికంగా కుంగిపోయిన కారణంగా ఇలాంటి సమస్యలు రావొచ్చనే అనుమానం వ్యక్తంచేసి, రాత్రి 7 గంటలకు ఇంటికి పంపించారు. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ముక్కు, నోటి నుంచి నురుగ వచ్చి ఒక్కసారిగా తమ కుమార్తె కుప్పకూలిందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. బీపీ, షుగర్‌ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘రోజులాగే రాత్రి బీపీ, షుగర్‌ మాత్రలు వేసుకునేందుకు నా గదిలోకి వెళ్లా. 10 నుంచి 15 మాత్రలు తక్కువగా ఉండటంతో అనుమానమొచ్చింది. నా కూతురే మింగి ఉంటుందని అనుమానంతో ఆరా తీశా. ఆరోగ్యం బాగానే ఉందా? అని అడిగా. బాగానే ఉందని చెప్పడంతో నిద్రపోయా. ఉదయానికంతా ఇలా జరిగింది’ అని యువతి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించారు. మానసిక ఒత్తిడితో ఇంట్లో కనిపించిన మాత్రలు మింగిందా? లేదా నిజంగానే ఆత్మహత్యకు పాల్పడిందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇష్టమే..కష్టమై..చివరికిలా

బాధిత యువతికి చిన్నప్పట్నుంచి కిడ్నాప్‌ కథలంటే ఇష్టపడేదని గతంలో ఆమెను విచారించే సమయంలో పోలీసులు గుర్తించారు. ఆస్తి కోసం తన సోదరుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ ఆర్నెల్ల కిందట స్నేహితుడిని నమ్మించేందుకు యత్నించిందనీ తెలుసుకున్నారు. కిడ్నాప్‌ కథాంశం ఉన్న వీడియోలను యూట్యూబ్‌లో తరచూ చూస్తుండేదని కుటుంబ సభ్యులు కూడా దర్యాప్తులో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు కూడా ఈ తరహా నాటకమే ఆడినట్లు పోలీసులు అప్పట్లో నిర్ధారణకు వచ్చారు. మరోవైపు గతంలో శంషాబాద్‌కు సమీపంలో జరిగిన ‘దిశ’ హత్యోదంతం తరహాలో యువతి కిడ్నాప్‌ వ్యవహారంపైనా సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడిచింది. ఘట్‌కేసర్‌ పరిధి రాంపల్లిలో స్థానికులు ధర్నాకు దిగారు. ఆటో డ్రైవర్లపై దాడికి యత్నించారు. ఇదంతా నాటకమని పోలీసులు వెల్లడించిన తర్వాత కూడా ఈ అంశం అదే స్థాయిలో చర్చ జరిగింది. కుటుంబమంతా ఇంటికి తాళం వేసి ఘట్‌కేసర్‌లోని బంధువుల(యువతి మేనమామ) ఇంటికెళ్లి మరీ తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె మానసికంగా కుంగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే బయటకు రాకుండా 11 రోజులు ఒంటరిగా గదిలో ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన