close

ప్రధానాంశాలు

Published : 27/02/2021 04:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జంటహత్యల వెనుక పెద్ద కుట్ర

రాజకీయ తలకాయలున్నాయ్‌
సీబీఐతో దర్యాప్తు జరిపించాలి
వామన్‌రావు తండ్రి పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయవాద దంపతులు వామన్‌రావు, పీవీ నాగమణిల హత్యలపై సీబీఐలాంటి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడు, కోడలు జంటహత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని, పోలీసు ఉన్నతాధికారులతోపాటు రాజకీయ తలకాయలు దాగి ఉన్నాయన్నారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నందున ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులను బదిలీ చేయాలని కోరారు. స్థానిక దేవాలయ వివాదంలో భాగంగానే వారిని హతమార్చారంటూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ కొడుకు, కోడలు ప్రవర్తనపై ఆరోపణలు చేస్తూ అపకీర్తిపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పోలీస్‌ కమిషనర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, చిన్న చిన్న విషయాలనూ హైకోర్టుకు తీసుకెళ్లేవారంటూ ఆరోపించారన్నారు. కాని తమ కొడుకు, కోడలు న్యాయవాదులైనందున ప్రజాప్రయోజనాల నిమిత్తం హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసేవారని చెప్పారు. జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకు నేర చరిత్ర ఉందని, గతంలో రౌడీషీట్‌ నమోదైందని, పలు క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయన్నారు. అక్రమ మైనింగ్‌, ఇసుక మాఫియా తదితరాలపై పుట్ట మధుతోపాటు ఆయన అనుచరులకు వ్యతిరేకంగా వామన్‌రావు దంపతులు పలు కేసులు పెట్టారన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పుట్ట శైలజ ఎన్నికను సవాలు చేస్తూ సాయేషా తరఫున తమ కోడలు పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. మంథని పోలీసు స్టేషన్‌లో శీలం రంగయ్య లాకప్‌డెత్‌పై కేసు వేసినందుకు పలు బెదిరింపులు వచ్చాయన్నారు. వీటన్నింటి నేపథ్యంలో పోలీసు దర్యాప్తుపై అనుమానాలున్నాయని, నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేదని, ఈకేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన