close

ప్రధానాంశాలు

Published : 01/03/2021 03:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధికారుల వాహనాన్ని ఢీకొన్న ఇసుక మాఫియా కారు

టిప్పర్‌ను తప్పించేందుకు కారులో వెంబడించి అడ్డంకులు
స్పెషల్‌స్క్వాడ్‌కు తప్పిన ముప్పు

తడ, న్యూస్‌టుడే: తమిళనాడుకు అక్రమంగా తరలుతున్న ఇసుక టిప్పర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎస్‌ఈబీ స్పెషల్‌స్క్వాడ్‌ వాహనాన్ని ఇసుక మాఫియా సిద్ధం చేసుకున్న పైలెట్‌ కారు ఢీకొంది. టిప్పర్‌ దొరక్కుండా ఉండేందుకు ఇసుక మాఫియా ఈ దారుణానికి తెగబడింది. అయితే అదృష్టవశాత్తు వాహనంలోని అధికారులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం జరిగిన ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివి. ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేసేందుకు నెల్లూరు జిల్లా తడలోని శ్రీసిటీ కూడలి రహదారి వద్ద ఎస్‌ఈబీ స్పెషల్‌స్క్వాడ్‌ ఎస్సై విజయ్‌శ్రీనివాస్‌ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ నుంచి సూళ్లూరుపేటకు బిల్లుతో బయల్దేరిన ఇసుక టిప్పర్‌ను బృందం ఆపినా ఆగకుండా వెళ్లింది. వెంటనే అధికారులు తమ వాహనంలో టిప్పర్‌ను వెంబడించారు. ఎస్‌ఈబీ అధికారుల వాహనాన్ని ముందుకు వెళ్లకుండా సినీ ఫక్కీలో పైలెట్‌గా సిద్ధం చేసుకున్న అక్రమార్కుల కారు అడుగడుగునా అడ్డు తగిలింది. అడ్డుపడుతున్న పైలెట్‌ కారును ఎలాగోలా తప్పించుకొని అధికారుల బృందం తమ కారును ఇసుక టిప్పర్‌ ముందు నిలిపింది. ఇదే సమయంలో పైలెట్‌ కారు వేగంగా వచ్చి అధికారుల బృందం కారును ఢీకొట్టింది. దాంతో అధికారులు ప్రయాణిస్తున్న కారు, మాఫియా పైలెట్‌ కారు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లాయి. అదృష్టవశాత్తు అధికారులకు ఎలాంటి గాయాలు కాలేదు. పైలెట్‌ కారు నడుపుతున్న ఇసుక టిప్పర్‌ యజమాని సురేష్‌ పారిపోగా, అందులోని భాస్కర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. అందిన ఫిర్యాదు మేరకు తడ పోలీసులు కేసు నమోదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన