close

ప్రధానాంశాలు

Published : 02/03/2021 08:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాణం తీసిన రుణపాశం

సాగు బాటలో సమిధలైన యువరైతులు
పురుగుల మందుతాగి ఇద్దరి బలవన్మరణం

నేరడిగొండ, న్యూస్‌టుడే: ఇద్దరూ పాతికేళ్ల యువ రైతులే.. పట్టభద్రులే అయినా.. తగిన ఉపాధి దొరకక సాగుబాట పట్టారు. ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు కౌలుకు తీసుకొని ఆశల సాగు చేపట్టిన వారు.. అప్పుల బాధలతో అనూహ్యంగా తనువు చాలించారు. అందులో వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్న రైతు ఒకరు కాగా.. మరొకరికి ఆర్నెల్ల క్రితమే పెళ్లయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదం నింపాయి. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని పట్‌పటితండాకు చెందిన జాదవ్‌ తుకారాం(25) డిగ్రీ పూర్తి చేశారు. తమ రెండెకరాల భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశారు. దిగుబడులు ఆశించిన మేరకు రాకపోవడం.. పెట్టుబడి కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆదివారం రాత్రి పురుగుల మందుతాగారు. అపస్మారక స్థితిలో ఉన్న తుకారాంను ప్రైవేటు వాహనంలో నేరడిగొండ మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఎస్సై భరత్‌ సుమన్‌ తెలిపారు. ఆయనకుభార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

దుబాయ్‌ వెళ్లలేక.. రుణం తీర్చలేక..

జన్నారం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ద్యావనపెల్లి రాజ్‌కుమార్‌(25) వరికోత యంత్రంపై పనిచేస్తున్నారు. తనకున్న ఎకరంతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేస్తున్నారు. పంట దిగుబడి రాక మనస్తాపం చెందారు. అప్పులు తీర్చడానికి దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరికొంత రుణం తీసుకున్నారు. కరోనా వల్ల గల్ఫ్‌ వెళ్లలేక చేసిన అప్పులు తీర్చలేక సోమవారం ఇంటి ఆవరణలో పురుగులమందు తాగారు.  కుటుంబ సభ్యులు జన్నారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోమృతిచెందారు. రాజ్‌కుమార్‌ భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జన్నారం స్టేషన్‌ రెండో ఎస్సై తానాజీ పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన